Asia Cup 2023: ఆసియా కప్‌ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?

దాయాదుల పోరు కోసం సర్వత్రా ఆసక్తి ఉంటుంది. అయితే భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) గత దశాబ్దకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడటం లేదు. మెగా టోర్నీల్లో తలపడుతూ అభిమానులకు మజాను అందిస్తున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్‌ (Asia Cup 2023) నిర్వహణపై అందరిలోనూ ఆందోళన రేగుతోంది. 

Published : 03 Feb 2023 22:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ 2023 (Asia cup 2023) నిర్వహణపై కొనసాగుతున్న అనిశ్చితికి శనివారం తెరపడే అవకాశం ఉంది. ఐసీసీ (ICC) షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్ వేదికగానే ఆసియా కప్ జరగాలి. కానీ, పాక్‌లో అయితే తమ జట్టు పర్యటించబోదని, తటస్థ వేదికగా అయితేనే పర్యటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రజా కూడా ఘాటుగానే స్పందించాడు. భారత్‌ ఆసియాకప్‌లో పాల్గొనబోతే.. వన్డే ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తామని పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కానీ, ఇప్పుడు పీసీబీకి కొత్త చీఫ్‌ వచ్చారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో భేటీ అవుతానని, సమస్యకు పరిష్కారం దిశగా సాగుతామనే ఆశాభవం వ్యక్తం చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

‘‘అత్యవసర భేటీలో భాగంగా శనివారం ఏసీసీ ఛైర్మన్‌ జైషాతోపాటు ఇతర సభ్యులను కలుస్తా’’ అని నజామ్‌ సేథీ తెలిపారు. అయితే సభ్యుల్లో ఎక్కువ మంది పాక్‌లో కాకుండా తటస్థ వేదికలో టోర్నీని నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లు ఏసీసీ వర్గాలు పేర్కొన్నాయి. గత ఆసియా కప్‌ కూడా యూఏఈ వేదికగానే జరిగిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి తమ దేశంలో ఈ టోర్నీని నిర్వహించడానికి ఖతర్‌ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శనివారం జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాదాపు పన్నెండేళ్ల నుంచి ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. తటస్థ వేదికలపైనే దాయాదుల పోరును చూస్తూ వచ్చాం. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ ఊతమిచ్చేలా వ్యవహరిస్తుందనే కారణంతో భారత్‌ జట్టును పంపేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. టీ20, వన్డే ప్రపంచకప్‌లతోపాటు ఆసియా కప్‌లోనూ ఇరు జట్లు తలపడుతూ వస్తున్నాయి. ఈసారి స్వదేశాల్లో మెగా టోర్నీలు ఉండటంతో సందిగ్ధత నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని