Asia Cup: ఆసియా కప్‌.. టీ కప్‌లా మారింది : పాక్‌ మాజీ కెప్టెన్‌

ఆసియా కప్‌(Asia Cup) నిర్వహణకు సంబంధించి ఏసీసీపై పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ (Salman Butt) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది టీ కప్‌లా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Published : 07 Feb 2023 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఈ ఏడాదిలో జరిగే ఆసియా కప్‌(Asia Cup) నిర్వహణపై తీవ్ర వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీని పాక్‌లో నిర్వహిస్తే.. భారత ఆటగాళ్లు అక్కడికి వెళ్లరని గతంలోనే బీసీసీఐ(BCCI) కార్యదర్శి జై షా(Jay Shah) స్పష్టం చేశారు. మరోవైపు ఈ టోర్నీ నిర్వహణ బాధ్యతలను వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు పాక్‌ చెబుతోంది. దీంతో ఈ వివాదంపై చర్చించేందుకు బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ACC) సమావేశం జరిగినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ అంశంపై చర్చించేందుకు మార్చిలో మరోసారి ఏసీసీ సమావేశం కానుంది. మరోవైపు ఈ వివాదంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ ఏసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌ను టీ కప్‌తో పోల్చాడు.

‘ప్రతి ఒక్కరికీ ఆఫర్‌ చేస్తుండటంతో ఆసియా కప్‌.. ‘కప్‌ ఆఫ్‌ టీ’లా మారింది. మేం మార్చి వరకు వేచి చూస్తాం. అయితే ఇది ఎవరి నియంత్రణలో లేని విషయం. ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. పరిస్థితులు మెరుగుపడి.. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతుందని భావిస్తున్నాను’ అని భట్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించాడు.

గత ఛైర్మన్ల మాదిరిగానే ప్రస్తుత పీసీబీ ఛైర్మన్‌ నజమ్‌ సేథీ ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. ఆసియా కప్‌ తమ దేశంలోనే నిర్వహించాలని పాక్‌ కోరుకుంటోందని ఏసీసీ ఛైర్మన్‌ అయిన జైషాకు నజమ్‌ సేథీ ఏసీసీ సమావేశంలో చెప్పినట్లు సమాచారం. తమ దేశం నుంచి ఈ టోర్నీని తరలిస్తే.. భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం తమ జట్టును పంపమని చెప్పినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ పాకిస్థాన్‌లోనే జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లో తాము ఆడేది లేదని గత ఏడాది అక్టోబర్‌లో జైషా తేల్చి చెప్పారు. దీంతో ఈ టోర్నీ నిర్వహణపై వివాదం మొదలైంది. వేదికను పాక్‌ నుంచి మార్చాలని ఏసీసీ భావిస్తున్నట్లు సమాచారం. మార్చిలో జరిగే సమావేశంలో ప్రత్యామ్నాయ వేదికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు