Hockey: ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ.. సెమీస్‌లో భారత్ జోరుకు కళ్లెం

యిఆసియా ఛాంపియన్స్‌ హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌.. అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఓటమన్నదే ఎరుగని భారత జట్టు..

Published : 21 Dec 2021 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా ఛాంపియన్స్‌ హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌.. అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఓటమన్నదే ఎరుగని భారత జట్టు కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో తడబడింది. జపాన్‌ చేతిలో 5-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఫైనల్‌ చేరకుండానే భారత్ పోరు ముగిసింది. ఇక మూడో స్థానం కోసం పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఆదివారం జపాన్‌తో జరిగిన లీగ్‌ దశ చివరి మ్యాచులో భారత్‌ 6-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలోనే పరిస్థితులు తారుమారయ్యాయి.

లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా..? అన్నట్లుగా జపాన్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. సెమీస్‌లో పూర్తి ఆధిపత్యం కొనసాగించారు. తొలి క్వార్టర్‌లోనే జపాన్ రెండు గోల్స్‌ సాధించింది. ఆ తర్వాత భారత్‌ నుంచి దిల్‌ప్రీత్‌ ఒక గోల్ కొట్టాడు. కొద్దిసేపటికే జపాన్ మరో గోల్‌ సాధించింది. దీంతో తొలి అర్ధ భాగం ఆట పూర్తయ్యేసరికి భారత్‌ 1-3 గోల్స్ తేడాతో వెనుకబడింది. అనంతరం జపాన్ మరో రెండు గోల్స్‌ సాధించి భారత్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. కాస్త పుంజుకున్న భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు గోల్స్‌ సాధించింది. హర్మన్‌ ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ చెరో గోల్‌ కొట్టారు. అయితే జపాన్‌ ఆధిక్యాన్ని 3-5కి తగ్గించగలిగినా.. విజయం మాత్రం దక్కలేదు.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని