Novak Djokovic: మీకు ఇంకేం ప్రశ్నలు లేవా? ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయిన జకోవిచ్‌!

పదే పదే ఒకే విషయంపై ప్రశ్నలు వేయడంతో టెన్నిస్ స్టార్‌ ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ప్రేక్షకులు కూడా సరైన మర్యాద పాటించకపోవడంపైనా స్పందించాడు.

Updated : 10 Jul 2024 14:34 IST

ఇంటర్నెట్ డెస్క్: వింబుల్డెన్‌ 2024 ఎడిషన్‌లో స్టార్‌ ప్లేయర్ నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic)కు ప్రేక్షకుల నుంచి విభిన్న అనుభవం ఎదురైంది. రౌండ్‌ 16 సందర్భంగా హోల్గర్ రూనెతో జకోవిచ్‌ పోటీపడ్డాడు. ఆ మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకుపోయాడు. ఇవాళ మినౌర్‌తో తలపడనున్నాడు. అయితే, నాలుగో రౌండ్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. ఓ రిపోర్టర్‌తో జకోవిచ్‌ మాట్లాడుతూ ఉండగానే ప్రేక్షకులు అరుపులతో హోరెత్తించారు. అగౌరవంగా ప్రవర్తించడంపై జకోవిచ్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. కొందరు తమ పరిధిని దాటారని.. ఇలా చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. దీంతో ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్‌ చేశాడు.

‘‘మ్యాచ్‌ ముగిసిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఉంటా. రోజంతా టెన్నిస్‌ను చూస్తూ ప్రోత్సహించడం సులువేం కాదు. అందుకోసం వారికి థాంక్స్‌ చెబుతా. ఇప్పటికీ నేను ఆడుతున్నానంటే దానికి కారణం వారి మద్దతే. కానీ, ఇవాళ కొందరు హద్దులు దాటారు. ఇలాంటప్పుడు తప్పకుండా వెంటనే స్పందిస్తా. కోర్టులో చేసే వ్యాఖ్యలు, చర్యలకు నేనేం పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు’’ అని సమాధానం ఇచ్చాడు. 

దానిపైనే దృష్టి పెడతారా?

ఆ రిపోర్టర్‌ మరోసారి ప్రేక్షకులకు సంబంధించిన ప్రశ్ననే అడిగారు. దాంతో జకోవిచ్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఈ టాపిక్ కాకుండా మరే ప్రశ్నలు లేవా? అని ప్రతిస్పందించాడు. ‘‘ప్రేక్షకుల ప్రవర్తన వ్యవహారం కాకుండా ఇతర ప్రశ్నలు మీ దగ్గర లేవా? మీరు కేవలం దానిపైనే దృష్టి పెడతారా? ఇప్పటికే మూడు ప్రశ్నలు అడిగారు. ఇక సరిపోతుంది. ఇతర విషయాలపై మనం మాట్లాడుకుంటే బెటర్‌’’ అని ఇంటర్వ్యూని ముగించాడు. ఆ తర్వాత మీడియా సంస్థ కూడా ఈ వ్యవహారంపై పోస్టు చేసింది. ప్రేక్షకులకు సంబంధించిన ప్రవర్తనపై స్పందించాల్సిందిగా జకోవిచ్‌ను అడగ్గా.. మధ్యలోనే వెళ్లిపోవడం జరిగిందని పేర్కొంది.

ఇంతకీ ఏమైందంటే?

డెన్మార్క్‌కు చెందిన ప్రత్యర్థి రూనెతో మ్యాచ్‌లో ఓ పాయింట్ విషయంలో జకోవిచ్‌ అప్పీలు చేశాడు. ఆ సమయంలో రూనెకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రేక్షకుల్లో కొందరు విపరీతంగా ప్రవర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మైదానంలోనే జకోవిచ్‌ స్పందించాడు. ‘మీరు కనీసం నన్ను టచ్‌ కూడా చేయలేరు’ అని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు