Lovilina: లవ్లీనాపై సీఎం వరాల జల్లు; రూ.కోటి‌, డీఎస్పీ ఉద్యోగం.. ఇంకా..‌

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశం కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భారీ నజరానా అందజేశారు. రూ.కోటి నగదు ప్రోత్సాహకం......

Published : 13 Aug 2021 01:38 IST

గువాహటి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశం కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భారీ నజరానా అందజేశారు. రూ.కోటి నగదు ప్రోత్సాహకం అందజేయడంతో పాటు పోలీస్‌ శాఖలో డీఎస్పీగా ఉద్యోగాన్ని ఆఫర్‌ చేశారు. అంతేకాకుండా రాష్ట్రానికి తొలి ఒలింపిక్‌ పతకం తెచ్చిపెట్టిన లవ్లీనాపై వరాలు కురిపించారు. 2024లో జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు నెలకు రూ.లక్ష చొప్పున స్కాలర్‌షిప్‌ రూపంలో ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే, గువాహటిలో ఒక రహదారికి ఆమె పేరు పెట్టనున్నట్టు సీఎం ప్రకటించారు.

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత తొలిసారి గువాహటి చేరుకున్న లవ్లీనాకు అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రే స్వయంగా విమానాశ్రాయనికి వెళ్లి ఆమెకు ఆహ్వానం పలకడం విశేషం. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆమెను నగరానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లవ్లీనాను ఘనంగా సన్మానించారు. ఆమె గ్రామం ఉండే నియోజకవర్గంలో సారుపతర్‌లో  బాక్సింగ్‌ అకాడమీతో పాటు ఓ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్టు సీఎం హామీ ఇచ్చారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడతామన్నారు.

ఒలింపిక్స్‌లో తొలిసారి రాష్ట్రానికి పతకం తీసుకురావడం ద్వారా లవ్లీనా పేరు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖితమైందన్నారు. ఆమె సాధించిన విజయం పట్ల రాష్ట్రం ఎంతో గర్వపడుతోందని చెప్పారు. పతకం సాధించినందుకు అభినందించడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.

ప్యారిస్‌లో పసిడి పంచ్‌ ఖాయం..

ఈ సందర్భంగా లవ్లీనా మాట్లాడుతూ.. పసిడి పతకం తేవడంలో విఫలమైనందుకు ఆవేదన వ్యక్తం చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం పసిడి పతకం తెస్తానని హామీ ఇచ్చారు. లవ్లీనాకు శిక్షణలో కీలకంగా వ్యవహరించిన నలుగురు కోచ్‌లకు గౌరవార్థంగా ₹10లక్షల చొప్పున ప్రభుత్వం అందజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని