e-auction: భవానీదేవి కత్తికి రూ.10కోట్లు.. నీరజ్‌ ఈటెకు రూ.1.20కోట్లు

టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది ఫెన్సర్‌ భవానీదేవి. ఆ క్రీడల్లో ఓటమిపాలైనప్పటికీ స్ఫూర్తిదాయక ప్రదర్శన

Updated : 17 Sep 2021 16:49 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది ఫెన్సర్‌ భవానీదేవి. ఆ క్రీడల్లో ఓటమిపాలైనప్పటికీ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి యావత్‌ భారతావని ప్రశంసలు అందుకుంది. అందుకేనేమో ఒలింపిక్స్‌లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్‌)కి కూడా అంతే ఆదరణ లభిస్తోంది. ప్రధానమంత్రికి  వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా భవానీదేవి కత్తిని వేలం వేయగా.. ఇప్పటికే బిడ్‌ ధర రూ.10కోట్లకు చేరింది. ఇక పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం అందుకున్న షట్లర్‌ కృష్ణ నాగర్‌ ఉపయోగించిన రాకెట్‌ ధర కూడా రూ.10కోట్లకు చేరింది.

ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని.. వివిధ సందర్భాలు, పర్యటనల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల పరికరాలు, దుస్తులను కూడా వేలానికి ఉంచారు. భవానీదేవి కత్తిని రూ.60లక్షల బేస్‌ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10కోట్లతో కొనసాగుతోంది. పారాలింపియన్‌ కృష్ణనాగర్‌ రాకెట్‌కు బేస్‌ ధర రూ.80లక్షలు కాగా.. ప్రస్తుతం రూ.10కోట్లకు చేరింది. పారాలింపిక్స్‌లో రజతం సాధించిన మరో షట్లర్‌ సుహాస్‌ యతిరాజ్‌ రాకెట్‌ను రూ.50లక్షల బేస్‌ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10కోట్లతో కొనసాగుతోంది.

రూ.90లక్షలు దాటిన సింధు రాకెట్‌..

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ.కోటి బేస్‌ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20కోట్లతో కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్‌కు రూ.80లక్షల బేస్‌ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం దాని ధర రూ.90లక్షలు దాటింది. టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ సంచలనం లవ్లీనా బోర్గొహేన్‌ చేతి గ్లౌజులను రూ. 80లక్షలతో వేలం ప్రారంభించగా.. ప్రస్తుత ధర రూ.1.80కోట్లుగా ఉంది.

కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు ఈ వేలం కొనసాగనుంది. వేలం పూర్తయిన తర్వాత అత్యధిక ధరతో బిడ్‌ వేసిన వారికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని