T20 World Cup: రాణించిన శ్రీలంక బ్యాటర్లు.. ఆస్ట్రేలియా ముందు మోస్తరు లక్ష్యం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదకగా జరుగుతున్న మ్యాచులో శ్రీలంక బ్యాటర్లు సమష్టిగా రాణించారు. చరిత్ అసలంక (35), కుశాల్‌ పెరీరా (35), భానుక రాజపక్సే (33) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో..

Updated : 28 Oct 2021 21:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు సమష్టిగా రాణించారు. చరిత్ అసలంక (35), కుశాల్‌ పెరీరా (35), భానుక రాజపక్సే (33) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్‌ జంపా, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్‌ రెండేసి వికెట్లు తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ప్యాట్‌ కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్‌ పీతమ్‌ నిశాంక (7) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసలంక.. మరో ఓపెనర్‌ కుశాల్ పెరీరాతో కలిసి వేగంగా ఆడాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక స్కోరు 53/1 గా ఉంది. దాటిగా ఆడుతున్న క్రమంలో ఆడమ్‌ జంపా వేసిన పదో ఓవర్లో అసలంక.. స్మిత్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే కుశాల్‌ పెరీరా కూడా ఔటయ్యాడు. దీంతో శ్రీలంక స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి అవిష్క ఫెర్నాండో (4), వాణిందు హసరంగ (4), దసున్‌ శనక (12) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన భానుక రాజపక్సే వేగంగా ఆడాడు. చమిక కరుణ రత్నే (9) పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక మోస్తరు పరుగులు చేయగలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని