Cricket News: ఇదో క్రేజీ రనౌట్‌.. లంక ఆటగాడిని అద్భుతంగా ఔట్‌ చేసిన ఫించ్‌, వేడ్‌

క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటాయి. అవి వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఓ టీ20 పోరులోనూ అలాంటి సంఘటనే జరిగింది...

Published : 19 Feb 2022 15:48 IST

(Photo: Cricket.com.au twitter video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటాయి. అవి వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఓ టీ20 పోరులోనూ అలాంటి సంఘటనే జరిగింది. అయితే, దానికి లంక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మహీష్‌ తీక్షణ (3) వికెట్‌ కోల్పోవడం గమనార్హం. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌, వికెట్‌ కీపర్‌ మాథ్యూవేడ్‌ తమ ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో ఈ రనౌట్‌లో భాగస్వాములయ్యారు.

గురువారం ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా 19వ ఓవర్‌ ఐదో బంతికి ఈ సంఘటన చోటుచేసుకుంది.  రిచర్డ్‌సన్‌ వేసిన బంతిని చామిక కరుణరత్నే (14*) కవర్స్‌లో షాట్‌ ఆడి సింగిల్‌ కోసం యత్నించాడు. అయితే, నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న తీక్షణ ఆ పరుగు తీసేందుకు తొలుత ఇష్టపడలేదు. అప్పటికే కరుణరత్నే సగం పిచ్‌ దాటి వచ్చేసరికి అతడు కాస్త ఆలస్యంగా స్పందించాడు. ఆ సమయంలో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫించ్‌ బంతిని అందుకొని వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ వైపు వేసేందుకు చూశాడు. అప్పటికి అతడు వికెట్లకు కాస్త దూరంగా ఉండటమే అందుకు కారణం. చివరికి తీక్షణ పరుగు కోసం ప్రయత్నించేసరికి ఫించ్‌ బంతిని కీపర్‌కు విసిరాడు. దీంతో దూరంగా ఉన్న వేడ్‌ పరుగెత్తుకుంటూ ముందుకు దూసుకొచ్చి బంతిని అందుకొని వికెట్లకేసి విసిరాడు. అదే సమయంలో లంక బ్యాట్స్‌మన్‌ సైతం క్రీజు దగ్గరగా వచ్చాడు. కానీ, చివరికి అతడు ఔటవ్వక తప్పలేదు. ఇప్పుడు ఈ వీడియోను ఓ ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పంచుకోగా అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ లంక బ్యాట్స్‌మన్‌ ఎలా ఔటయ్యాడో మీరూ చూడండి. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి ప్రస్తుతం సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని