Aussies Captain: ఆసీస్‌ కెప్టెన్‌గా ఆ ఫాస్ట్‌ బౌలర్‌ అయితే బెటర్‌: ఆకాశ్‌ చోప్రా

మహిళతో అసభ్యకర సందేశాల చాటింగ్‌ చేసినట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టిమ్‌ పైన్‌ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని...

Updated : 25 Nov 2021 22:32 IST

స్టీవ్‌స్మిత్‌ కూడా అర్హుడేనన్న క్రికెట్‌ విశ్లేషకుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళతో అసభ్యకర సందేశాల చాటింగ్‌ చేసినట్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టిమ్‌ పైన్‌ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. డిసెంబర్‌ 8 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎంపికపై క్రికెట్ ఆస్ట్రేలియా వేట కొనసాగిస్తోంది. 2018లో స్టీవ్‌స్మిత్ బాల్‌ టాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాక పైన్‌ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు 2019లో ఇంగ్లాండ్‌లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్నా.. భారత్‌తో అంతకుముందు, ఆ తర్వాత స్వదేశంలో ఆడిన రెండు బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసభ్యకర సందేశాల వివాదం తెరపైకి రావడంతో అతడు ఇటీవల కెప్టెన్సీని వదులుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఆటగాడిగానైనా ఆసీస్‌ జట్టులో కొనసాగాలని ఉందని పైన్‌ పేర్కొన్నాడు. ట్రోఫీ సాధించి ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో ఆసీస్‌ కెప్టెన్‌గా ఎవరుంటారనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ క్రీడా విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రా ముగ్గురు క్రికెటర్ల పేర్లను సూచించాడు. అందులో మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ కూడా ఉండటం విశేషం. మిగతా ఇద్దరిలో ప్యాట్‌ కమిన్స్‌, మార్నస్‌ లబుషేన్‌ ఉన్నట్లు పేర్కొన్నాడు. ‘‘నా అంచనా ప్రకారం ముగ్గురిలో పాట్‌ కమిన్స్‌ అందరికంటే రేసులో ముందున్నాడు. ఫాస్ట్‌బౌలర్‌ అయిన కమిన్స్‌ యాషెస్‌లోని అన్ని మ్యాచులను ఆడగల సత్తా ఉన్నవాడు. మరోవైపు స్టీవ్‌ స్మిత్‌పై బాల్‌ ట్యాంపరింగ్‌ కళంకం ఉంది. అయినా అతడూ కెప్టెన్సీకి అర్హుడే. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా నైతికత ఆధారంగా నిర్ణయం తీసుకుంటే పాట్‌ కమిన్స్‌కే ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నాయి. ఒక వేళ బౌలర్‌ను కాదు.. బ్యాటర్‌నే సారథిగా ఎంపిక చేద్దామని లబుషేన్‌ను ఎంచుకుంటే మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక వేళ ప్యాట్‌ కమిన్స్‌ను వద్దనుకుని లబుషేన్‌ వైపు మొగ్గు చూపితే ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. యాషెస్‌ అనేది ఎంతో ఒత్తిడి ఉండే టెస్టు సిరీస్‌. కాబట్టి లబుషేన్‌కు అనుభవం సరిపోకపోవచ్చు. అప్పుడు లబుషేన్‌ కంటే స్మిత్‌ అయితేనే బెటర్’’ అని ఆకాశ్‌ చోప్రా వివరించాడు. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని