Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్‌ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్‌ వైరల్‌

వీసా ఆలస్యం కారణంగా భారత్‌కు వచ్చే ఫ్లైట్‌ మిస్సయ్యాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా. దీంతో నిరాశ చెందిన అతడు ఒక ఆసక్తికర మీమ్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Published : 02 Feb 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీసా ఆలస్యం కారణంగా భారత్‌కు వచ్చే ఫ్లైట్‌ మిస్సయ్యాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా. అందువల్ల అతడు భారత్‌కు ఆలస్యంగా చేరుకోనున్నాడు. దీంతో నిరాశ చెందిన ఖవాజా..సామాజిక మాధ్యమాల్లో ఒక మీమ్‌ పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఓ షోకు సంబంధించిన ఫొటో పోస్టు చేసి..‘‘భారత వీసా కోసం నేనూ ఇలాగే ఎదురుచూస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ఫిబ్రవరి 9న భారత్‌ వేదికగా ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు మంగళవారం భారత్‌ చేరుకున్నారు. తన వీసా బుధవారం వస్తే గురువారం భారత్‌కు చేరుకోవచ్చని ఖవాజా ఆశిస్తున్నాడు. అయితే అతడికి వీసా ఆలస్యమవడం ఇదేం తొలిసారి కాదు. 2011లో ఐపీఎల్‌ సమయంలోనూ అతడు ఇదే తరహా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. భారత అధికారుల చొరవతో ఆ సమస్య పరిష్కారమైంది. ఆస్ట్రేలియా జట్టులో ఖవాజా కీలక ఆటగాడు. అద్భుతమైన స్పిన్నర్‌. గతేడాది 11 టెస్టు మ్యాచులు ఆడిన అతడు 4 శతకాలు ,5 అర్ధ శతకాలు బాది 1,080 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఉత్తమ టెస్టు ఆటగాడిగా అతడు సిడ్నీలో సోమవారం షేన్‌ వార్న్‌ అవార్డు అందుకున్నాడు. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని