T20 World Cup 2024: కమిన్స్‌ హ్యాట్రిక్‌

కమిన్స్‌ అదరగొట్టాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా తరపున తన కెరీర్‌లోనూ మొదటి సారి వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు.

Published : 22 Jun 2024 04:50 IST

మెరిసిన వార్నర్, జంపా 
బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం

కమిన్స్‌ అదరగొట్టాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా తరపున తన కెరీర్‌లోనూ మొదటి సారి వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో వార్నర్‌ చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన ఆసీస్‌.. సూపర్‌-8లో బోణీ కొట్టింది. 

నార్త్‌సౌండ్‌

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం వర్ష ప్రభావిత గ్రూప్‌-1 మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి (డీఎల్‌ఎస్‌) ప్రకారం బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో గెలిచిన ఆ జట్టు.. సూపర్‌-8ను ఘనంగా మొదలెట్టింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో (41; 36 బంతుల్లో 5×4, 1×6), తౌహిద్‌ హృదాయ్‌ (40; 28 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కమిన్స్‌ (3/29) హ్యాట్రిక్‌ వికెట్లతో సత్తాచాటాడు. జంపా (2/24) కూడా మెరిశాడు. ఛేదనలో వార్నర్‌ (53 నాటౌట్‌; 35 బంతుల్లో 5×4, 3×6) చెలరేగడంతో ఆసీస్‌ 11.2 ఓవర్లలో 100/2తో నిలిచింది. ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను ఆపేశారు.  బంగ్లా బౌలర్లలో రిషాద్‌ (2/23) ఆకట్టుకున్నాడు. 

వార్నర్‌ దూకుడు: ఛేదనలో వార్నర్‌ దూకుడుతో ఆసీస్‌ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రివర్స్‌ స్వీప్‌తో బౌండరీల ఖాతా తెరిచి తన ఉద్దేశాన్ని చాటిన వార్నర్‌ ఏ దశలోనూ ఆగలేదు. మరో ఓపెనర్‌ హెడ్‌ (31; 21 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి అతను బంగ్లా బౌలర్ల పని పట్టాడు. పవర్‌ప్లేను 59/0తో ముగించిన ఆసీస్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఆ తర్వాతి ఓవర్లో వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తిరిగి ఆట ఆరంభమయ్యాక రిషాద్‌ వరుస ఓవర్లలో హెడ్, మార్ష్‌ (1)ను ఔట్‌ చేశాడు. కానీ మ్యాక్స్‌వెల్‌ (14 నాటౌట్‌)తో కలిసి వార్నర్‌ దంచుడు కొనసాగించాడు. 12వ ఓవర్లో వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి డీఎల్‌ఎస్‌ ప్రకారం ఆసీస్‌ 28 పరుగులు ఎక్కువే చేసి విజయతీరాలకు చేరింది. 

ఆఖర్లో హ్యాట్రిక్‌తో: అంతకుముందు వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు స్టార్క్‌ (1/21) తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే తంజిద్‌ (0)ను బౌల్డ్‌ చేశాడు. నజ్ముల్, లిటన్‌దాస్‌ (16) కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు. 8 ఓవర్లకు 57/1తో ఆ జట్టు నిలిచింది. కానీ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టిన జంపా.. వికెట్ల పతనానికి గేట్లెత్తాడు. ఓ ఎండ్‌లో హృదోయ్‌ నిలబడ్డా అతనికి సహకరించే బ్యాటర్‌ కరవయ్యాడు. ఇక ఆఖర్లో హ్యాట్రిక్‌తో కమిన్స్‌ ఆ జట్టును దెబ్బ కొట్టాడు. కమిన్స్‌ 18వ ఓవర్‌ 5వ బంతిని మహ్మదుల్లా (2) వికెట్ల పైకి ఆడుకోగా.. తర్వాతి బంతికి మెహదీ (0) క్యాచ్‌ ఇచ్చాడు. చివరి ఓవర్‌ తొలి బంతికి హృ దాయ్‌ను ఔట్‌ చేసిన కమిన్స్‌ హ్యాట్రిక్‌ పూర్తిచేశాడు. 

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ (బి) స్టార్క్‌ 0; లిటన్‌దాస్‌ (బి) జంపా 16; నజ్ముల్‌ ఎల్బీ (బి) జంపా 41; రిషద్‌ (సి) జంపా (బి) మ్యాక్స్‌వెల్‌ 2; హృదాయ్‌ (సి) హేజిల్‌వుడ్‌ (బి) కమిన్స్‌ 40; షకిబ్‌ (సి) అండ్‌ (బి) స్టాయినిస్‌ 8; మహ్మదుల్లా (బి) కమిన్స్‌ 2; మెహదీ హసన్‌ (సి) జంపా (బి) కమిన్స్‌ 0; తస్కిన్‌ నాటౌట్‌ 13; తంజిమ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140; వికెట్ల పతనం: 1-0, 2-58, 3-67, 4-84, 5-103, 6-122, 7-122, 8-133; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-21-1; హేజిల్‌వుడ్‌ 4-1-25-0; కమిన్స్‌ 4-0-29-3; జంపా 4-0-24-2; స్టాయినిస్‌ 2-0-24-1; మ్యాక్స్‌వెల్‌ 2-0-14-1

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ నాటౌట్‌ 53; హెడ్‌ (బి) రిషాద్‌ 31; మిచెల్‌ మార్ష్‌ ఎల్బీ (బి) రిషాద్‌ 1; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (11.2 ఓవర్లలో 2 వికెట్లకు) 100; వికెట్ల పతనం: 1-65, 2-69; బౌలింగ్‌: మెహదీ హసన్‌ 4-0-22-0; తంజిమ్‌ 1-0-9-0; తస్కిన్‌ 1.2-0-22-0; ముస్తాఫిజుర్‌ 2-0-23-0; రిషాద్‌ 3-0-23-2 

2

టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌ స్థానం. బ్రెట్‌లీ (2007లో బంగ్లాదేశ్‌పై) ముందున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని