IND vs AUS: సిరీస్‌.. ఇచ్చేశారు

టీమ్‌ఇండియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆస్ట్రేలియాదే.  బుధవారం చివరి మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన కంగారూలు 2-1తో సిరీస్‌ పట్టేశారు.

Updated : 23 Mar 2023 07:50 IST

చేజేతులా టీమ్‌ఇండియా ఓటమి
మూడో వన్డే ఆస్ట్రేలియాదే
తిప్పేసిన జంపా, అగర్‌

203/7.. ఓ దశలో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా స్కోరిది. ఇంకేముంది మిగతా మూడు వికెట్లనూ త్వరగా పడగొట్టేసి.. ప్రత్యర్థిని 220లోపే పరిమితం చేస్తుందని టీమ్‌ఇండియాపై అంచనాలు. కానీ తోకను కత్తిరించడంలోని బలహీనతను మరోసారి బయటపెట్టుకున్న భారత్‌.. కంగారూలను 269 స్కోరు చేయనిచ్చింది.

185/4.. ఛేదనలో ఓ దశలో టీమ్‌ఇండియా స్కోరిది. అప్పటికే అర్ధశతకం అందుకున్న కోహ్లి.. బౌండరీల వేటలో సాగుతున్న హార్దిక్‌ జోరు మీదున్నారు. భారత్‌దే విజయమనే ధీమా! కానీ వికెట్లు పారేసుకుని.. చేజేతులారా ఓటమి కొనితెచ్చుకుంది. కోహ్లి వికెట్‌తో మలుపు తిరిగిన మ్యాచ్‌.. చివరకు ఆసీస్‌ ఖాతాలో చేరింది. మొదట బౌలింగ్‌లో పట్టు విడిచి.. అనంతరం బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన రోహిత్‌ సేన సిరీస్‌ను సమర్పించుకుంది.

చెన్నై: టీమ్‌ఇండియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆస్ట్రేలియాదే.  బుధవారం చివరి మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన కంగారూలు 2-1తో సిరీస్‌ పట్టేశారు. మొదట ఆసీస్‌ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (47; 47 బంతుల్లో 8×4, 1×6) టాప్‌స్కోరర్‌. మంచి పేస్‌తో కూడిన వైవిధ్యమైన బంతులతో హార్దిక్‌ పాండ్య (3/44), స్పిన్‌తో కుల్‌దీప్‌ యాదవ్‌ (3/56) ఆసీస్‌ను దెబ్బకొట్టారు. మహమ్మద్‌ సిరాజ్‌ (2/37), అక్షర్‌ పటేల్‌ (2/57) కూడా రాణించారు. ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి (54; 72 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్‌ (40; 40 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆడమ్‌ జంపా (4/45) భారత్‌ను దెబ్బకొట్టాడు. మిచెల్‌ మార్ష్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు.  

వికెట్లు పారేసుకుని..: మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన భారత బ్యాటర్లు.. చేతులారా వికెట్లు పారేసుకుని జట్టుకు ఓటమి మిగిల్చారు. గత రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన స్టార్క్‌ను సమర్థంగా ఎదుర్కొన్న మన బ్యాటర్లను.. ఈ సారి స్పిన్నర్లు జంపా, అగర్‌ (2/41) దెబ్బకొట్టారు. ఓపెనర్లు రోహిత్‌ (30), గిల్‌ (37) పరుగుల వేటలో సాగడంతో 9 ఓవర్లకు 65/0తో భారత్‌ ఛేదన సాఫీగా సాగుతున్నట్లనిపించింది.  కానీ స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరూ పెవిలియన్‌ చేరడంతో దెబ్బపడింది. ఆ దశలో కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ (32) పట్టుదలతో క్రీజులో నిలబడ్డారు. పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తుండడంతో జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేశారు. దీంతో 19 నుంచి 26 మధ్యలో 8 ఓవర్లలో కేవలం ఒక్క ఫోర్‌ మాత్రమే వచ్చింది. ఆ బౌండరీతోనే గేరు మార్చిన రాహుల్‌.. ఆ తర్వాత స్టార్క్‌ ఓవర్లో సిక్సర్‌, ఫోర్‌ కొట్టాడు. కానీ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రాహుల్‌ ఔటవడంతో 69 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్‌ రనౌట్‌ కావడంతో భారత్‌ 151/4తో నిలిచింది. అర్ధశతకాన్ని అందుకున్న కోహ్లి అండతో హార్దిక్‌ షాట్లు ఆడాడు. ఈ జోడీ జట్టును విజయ తీరాలకు చేర్చేలా కనిపించింది. కానీ ఒక్క ఓవర్‌లో పరిస్థితి తలకిందులైంది. అగర్‌ వరుస బంతుల్లో కోహ్లి, సూర్యకుమార్‌ (0)ను పెవిలియన్‌ చేర్చి భారత్‌కు షాకిచ్చాడు. షాట్‌ ఆడబోయిన కోహ్లి.. వార్నర్‌ చేతికి చిక్కాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డయిన సూర్య వరుసగా మూడోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఒక్కసారిగా 185/6తో జట్టు కష్టాల్లో పడింది. అప్పుడు హార్దిక్‌, జడేజా (18)పైనే ఆశలన్నీ. బౌండరీలు రాకపోయినా వికెట్‌ కాపాడుకుంటూనే వీళ్లు స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ సాగారు. కానీ సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోతుండడంతో జంపా బౌలింగ్‌లో షాట్‌ కోసం ప్రయత్నించిన హార్దిక్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. విజయానికి చివరి 5 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి వచ్చింది. తర్వాతి ఓవర్‌ తొలి బంతికే జంపా బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి జడేజా కూడా ఔటవడంతో భారత ఓటమి ఖాయమైంది. వరుసగా 6, 4 కొట్టి షమి (14) ఆశలు రేపినా.. ఆ తర్వాతి బంతికే అతను బౌల్డయ్యాడు. సిరాజ్‌ (3 నాటౌట్‌), కుల్‌దీప్‌ (6) అద్భుతమేమీ చేయలేకపోయారు.

ఆఖర్లో పట్టు వదిలి..: చెపాక్‌లో జరిగిన వన్డేల్లో ఎక్కువ శాతం మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే విజయాలు సాధించడంతో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కూడా ఎలాంటి సందేహం లేకుండా భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. వార్నర్‌ (23) కోలుకుని వచ్చినా.. జోరు మీదున్న హెడ్‌ (33), మార్ష్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ఈ ఇద్దరూ దూకుడు కొనసాగించారు. 10 ఓవర్లకు 61/0తో నిలిచిన ఆసీస్‌.. 300కు పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ హార్దిక్‌ బౌలింగ్‌కు రావడంతో కథ మలుపు తిరిగింది. అతడు తన వరుస ఓవర్లలో మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. షార్ట్‌పిచ్‌ బంతితో మొదట హెడ్‌ను బుట్టలో వేసుకున్న హార్దిక్‌.. 68 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అనంతరం మంచి లెంగ్త్‌ బంతితో స్మిత్‌ను మరోసారి బలి తీసుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతిని మార్ష్‌ వికెట్ల మీదకు ఆడుకోవడంతో హార్దిక్‌కు మూడో వికెట్‌ దక్కింది. వన్డేల్లో కేవలం రెండో సారి మాత్రమే ఓపెనర్‌గా కాకుండా వేరే స్థానం (4వ)లో వచ్చిన వార్నర్‌.. లబుషేన్‌ (28) జతగా ఇన్నింగ్స్‌ నిర్మించేందుకు ప్రయత్నించాడు. రెండు వైపుల నుంచి భారత్‌ స్పిన్‌ దాడి చేయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగింది. ప్రమాదకరంగా మారుతున్న వార్నర్‌, లబుషేన్‌ను కుల్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఈ సారి కేరీ (38), స్టాయినిస్‌ (25) ఆరో వికెట్‌కు 58 పరుగులు జతచేశారు. ఈ ఇద్దరినీ స్వల్ప వ్యవధిలో భారత్‌ వెనక్కిపంపింది. ముఖ్యంగా అద్భుతమైన బంతితో కేరీని కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. 203/7తో నిలిచిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌ త్వరగానే ముగిసేలా కనిపించింది. కానీ ఆఖర్లో భారత బౌలర్లు పట్టు విడిచారు. అబాట్‌ (26), అగర్‌ (17), స్టార్క్‌ (10), జంపా (10 నాటౌట్‌) కలిసి ఆ జట్టు స్కోరును 260 దాటించారు.


ఆ బౌల్డ్‌.. ఈ రనౌట్‌

మ్యాచ్‌లో కేరీని బౌల్డ్‌ చేసిన కుల్‌దీప్‌ బంతి, అక్షర్‌ను రనౌట్‌ చేసిన స్మిత్‌ ఫీల్డింగ్‌ విన్యాసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అప్పటికే క్రీజులో కుదురుకున్న కేరీ చక్కగా ఆడుతున్నాడు. 39వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన కుల్‌దీప్‌.. తొలి బంతికే అతణ్ని పెవిలియన్‌ చేర్చాడు. మిడిల్‌, లెగ్‌ స్టంప్‌ మధ్యలో వేసిన లెగ్‌కట్టర్‌ గిర్రున తిరిగి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. డిఫెండ్‌ చేసేందుకు కేరీ ప్రయత్నించినా.. అతని బ్యాట్‌ను దాటి వెళ్లి మరీ స్టంప్స్‌ను తాకింది. దీంతో కేరీతో పాటు కుల్‌దీప్‌ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక భారత బ్యాటింగ్‌లో స్మిత్‌ అద్భుత ఫీల్డింగ్‌, వికెట్‌ కీపర్‌ కేరీ విన్యాసంతో అక్షర్‌ వెనుదిరగాల్సి వచ్చింది. స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌ అయిదో బంతిని మిడ్‌వికెట్‌ వైపు పంపించిన అక్షర్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. కానీ తన ఎడమవైపు డైవ్‌ చేసిన స్మిత్‌ బంతిని ఆపాడు. అది గమనించిన కోహ్లి.. అక్షర్‌ను వెనక్కి పంపించాడు. అప్పటిలోపే డైవ్‌ చేసిన స్థితిలోనే ఉండి బంతిని నేలపై నుంచే వికెట్ల వైపు స్మిత్‌ విసిరాడు. దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన కేరీ ఆ బంతిని పట్టుకుని డైవ్‌ చేసి మరీ స్టంప్స్‌ను ఎగరకొట్టాడు.


అతిథులుగా గద్దలు..

మ్యాచ్‌కు అనుకోని అతిథులుగా గద్దలు వచ్చాయి. దీంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. భారత ఇన్నింగ్స్‌ 42వ ఓవర్లో స్టాయినిస్‌ నాలుగో బంతి వేసిన తర్వాత గద్దలు మైదానంలో కనిపించాయి. నేలపై ఉన్న ఓ మిడతను ఓ గద్ద తన్నుకు పోయింది. మైదానంలో స్పైడర్‌ కెమెరా చుట్టూ గద్దలు తిరిగాయి. దీంతో కాసేపు ఆటకు ఆటంకం ఏర్పడింది.

భాగస్వామ్యాలు లేకే: రోహిత్‌

మ్యాచ్‌ రెండో భాగంలో పిచ్‌ సవాలుగా మారిందని, కానీ భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమయ్యామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘‘269 పరుగులు ఎక్కువ అని అనుకోను. మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ సవాలు విసిరింది. మేం ఉత్తమంగా బ్యాటింగ్‌ చేశామని అనుకోవడం లేదు. మేం భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. మా ఆటగాళ్లు ఔటైన తీరు పట్ల నిరాశతో ఉన్నా. ఇలాంటి పిచ్‌లపైన ఎన్నో సార్లు ఆడాం. ఇక్కడే ఎదిగాం. కొన్నిసార్లు మన నైపుణ్యాలను సమర్థంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. క్రీజులో నిలబడేందుకు అవకాశం తీసుకోవాలి. ఎక్కువ సేపు క్రీజులో ఉండడం ముఖ్యం. మేం ప్రయత్నించినా ఈ మ్యాచ్‌లో అది సాధ్యం కాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఆడిన తొమ్మిది వన్డేల్లో ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. మేం ఏ విషయాల్లో మెరుగవ్వాలనేది అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇది జట్టు సమష్టి వైఫల్యం’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) కుల్‌దీప్‌ (బి) హార్దిక్‌ 33; మార్ష్‌ (బి) హార్దిక్‌ 47; స్మిత్‌ (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ 0; వార్నర్‌ (సి) హార్దిక్‌ (బి) కుల్‌దీప్‌ 23; లబుషేన్‌ (సి) గిల్‌ (బి) కుల్‌దీప్‌ 28; కేరీ (బి) కుల్‌దీప్‌ 38; స్టాయినిస్‌ (సి) గిల్‌ (బి) అక్షర్‌ 25; అబాట్‌ (బి) అక్షర్‌ 26; అగర్‌ (సి) అక్షర్‌ (బి) సిరాజ్‌ 17; స్టార్క్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 10; జంపా నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్‌) 269; వికెట్ల పతనం: 1-68, 2-74, 3-85, 4-125, 5-138, 6-196, 7-203, 8-245, 9-247; బౌలింగ్‌: షమి 6-0-37-0; సిరాజ్‌ 7-1-37-2; అక్షర్‌ 8-0-57-2; హార్దిక్‌ 8-0-44-3; జడేజా 10-0-34-0; కుల్‌దీప్‌ 10-1-56-3

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) అబాట్‌ 30; శుభ్‌మన్‌ ఎల్బీ (బి) జంపా 37; కోహ్లి (సి) వార్నర్‌ (బి) అగర్‌ 54; కేఎల్‌ రాహుల్‌ (సి) అబాట్‌ (బి) జంపా 32; అక్షర్‌ రనౌట్‌ 2; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) జంపా 40; సూర్యకుమార్‌ (బి) అగర్‌ 0; జడేజా (సి) స్టాయినిస్‌ (బి) జంపా 18; కుల్‌దీప్‌ రనౌట్‌ 6; షమి (బి) స్టాయినిస్‌ 14; సిరాజ్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (49.1 ఓవర్లలో ఆలౌట్‌) 248; వికెట్ల పతనం: 1-65, 2-77, 3-146, 4-151, 5-185, 6-185, 7-218, 8-225, 9-243; బౌలింగ్‌: స్టార్క్‌ 10-0-67-0; స్టాయినిస్‌ 9.1-0-43-1; అబాట్‌ 10-0-50-1; జంపా 10-0-45-4; అగర్‌ 10-0-41-2


* అన్ని ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 26 వరుస సిరీస్‌ విజయాల తర్వాత టీమ్‌ఇండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. మరోవైపు 2019 ఏప్రిల్‌ తర్వాత స్వదేశంలో భారత్‌కిదే తొలి వన్డే సిరీస్‌ ఓటమి.


* వన్డేల్లో వార్నర్‌ ఓపెనర్‌గా ఆడకపోవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పైనా అతను ఓపెనింగ్‌ చేయలేదు. ఆ మ్యాచ్‌లో అయిదో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని