T20 World Cup: గండాలు దాటి.. గట్టెక్కిన ఇంగ్లాండ్‌

వర్షం ఆగాలి.. మ్యాచ్‌ సాగాలి.. ఇంగ్లాండ్‌ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులూ కోరుకున్నది ఇదే. ఒకవేళ వాన కారణంగా నమీబియాతో మ్యాచ్‌ రద్దయితే ఇంగ్లాండ్‌ ఇంటి ముఖం పట్టేదే.

Published : 17 Jun 2024 03:51 IST

సూపర్‌-8కు అర్హత 
నమీబియాపై విజయం 
నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా)


వర్షం ఆగాలి.. మ్యాచ్‌ సాగాలి.. ఇంగ్లాండ్‌ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులూ కోరుకున్నది ఇదే. ఒకవేళ వాన కారణంగా నమీబియాతో మ్యాచ్‌ రద్దయితే ఇంగ్లాండ్‌ ఇంటి ముఖం పట్టేదే. కానీ వరుణుడి గండాన్ని దాటిన ఇంగ్లిష్‌ జట్టు నమీబియాపై గెలిచి రేసులో నిలిచింది. 

కానీ అక్కడితోనే అయిపోలేదు. ఇంగ్లాండ్‌కు ఆందోళన తప్పలేదు. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా గెలిస్తేనే బట్లర్‌ సేన ముందంజ వేసే పరిస్థితి. కానీ ఆసీస్‌నేమో స్కాట్లాండ్‌ కంగారెత్తించింది. అంత కంటే ఎక్కువగా ఇంగ్లాండ్‌ను భయపెట్టించింది. ఆసీస్‌ గెలవాలని దాని చిరకాల ప్రత్యర్థి అయిన ఇంగ్లాండ్‌ అభిమానులు ప్రార్థించారు. చివరకు కంగారూ జట్టు నెగ్గడంతో హమ్మయ్యా అనుకుంటూ నాటకీయ పరిణామాల మధ్య సూపర్‌- 8కు ఇంగ్లాండ్‌ అర్హత సాధించింది. 

టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ నిలిచింది. కీలకమైన గ్రూప్‌- బి పోరులో నమీబియాపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 41 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా దాదాపు మూడు గంటల ఆలస్యంగా శనివారం అర్ధరాత్రి ఒకటిన్నరకు ఈ మ్యాచ్‌ ఆరంభమైంది. ఇన్నింగ్స్‌ను మొదట 11 ఓవర్లకు, ఆ తర్వాత 10 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ నిర్వహించారు. మొదట ఇంగ్లాండ్‌ 10 ఓవర్లలో 5 వికెట్లకు 122 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హ్యారీబ్రూక్‌ (47 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4, 2×6), బెయిర్‌స్టో (31; 18 బంతుల్లో 3×4, 2×6) సత్తాచాటారు. ట్రంపుల్‌మన్‌ (2/31) ఆకట్టుకున్నాడు. సవరించిన లక్ష్య (126) ఛేదనలో నమీబియా 10 ఓవర్లలో 3 వికెట్లకు 84 పరుగులే చేయగలిగింది. లింజెన్‌ (33; 29 బంతుల్లో 1×4, 3×6) టాప్‌స్కోరర్‌. 

కట్టడి చేసి: ఛేదనలో దూకుడు ప్రదర్శించిన నమీబియా విజయం దక్కడానికి అవసరమైనంత వేగంగా మాత్రం ఆడలేకపోయింది. కొత్త బంతితో టాప్లీ తన రెండు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఓ వైపు లింజెన్‌ ఎదురుదాడికి దిగినా.. డేవిన్‌ (18) నెమ్మదించడంతో 5 ఓవర్లకు ఆ జట్టు 34 పరుగులే చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే డేవిన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా నిష్క్రమించాడు. దీంతో క్రీజులో అడుగుపెట్టిన వీజ్‌ (27; 12 బంతుల్లో 2×4, 2×6) బౌండరీల వేటలో సాగాడు. అయినా ఆ జట్టు లక్ష్యానికి దగ్గరగా వెళ్లలేకపోయింది. ఇంగ్లాండ్‌ ఆఖర్లో లింజెన్, వీజ్‌లను ఔట్‌ చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌ ఆరంభంలో ఇంగ్లాండ్‌ తడబడింది. 3 ఓవర్లకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి 18 పరుగులే చేసింది. కానీ బెయిర్‌స్టోకు హ్యారీబ్రూక్‌ జత కలిసిన తర్వాత ఆ ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. బౌండరీల మోత మోగింది. ముఖ్యంగా బ్రూక్‌ చెలరేగిపోయాడు. బ్రాసెల్‌ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదేశాడు. ఇక చివరి ఓవర్లో మొయిన్‌ అలీ (16; 6 బంతుల్లో 2×6), లివింగ్‌స్టన్‌ (13; 4 బంతుల్లో 2×6) కలిపి మూడు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చారు. 

చివరి జట్టేది? 

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌- 8 చేరే చివరి జట్టేదే నేడే తేలనుంది. ఇప్పటికే గ్రూప్‌-ఎ నుంచి భారత్, అమెరికా; గ్రూప్‌- బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌; గ్రూప్‌- సి నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్‌; గ్రూప్‌- డి నుంచి దక్షిణాఫ్రికా ముందంజ వేశాయి. ఇక గ్రూప్‌- డిలో మరో స్థానం కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ మధ్య పోటీ నెలకొంది. సోమవారం నేపాల్‌తో బంగ్లాదేశ్, శ్రీలంకతో నెదర్లాండ్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ల ఫలితంతో సూపర్‌- 8లో ఆడే ఆ ఆఖరి జట్టు ఏది అనేది స్పష్టమవుతుంది. గ్రూప్‌- బిలో నమీబియాపై గెలిచిన ఇంగ్లాండ్‌ 5 పాయింట్లతో స్కాట్లాండ్‌తో సమంగా నిలిచింది. కానీ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ఇంగ్లాండ్‌ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది. 

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) గ్రీన్‌ (బి) వీజ్‌ 11; బట్లర్‌ (బి) ట్రంపుల్‌మన్‌ 0; బెయిర్‌స్టో (సి) గ్రీన్‌ (బి) బెర్నార్డ్‌ 31; హ్యారీబ్రూక్‌ నాటౌట్‌ 47; మొయిన్‌ అలీ (సి) డేవిన్‌ (బి) ట్రంపుల్‌మన్‌ 16; లివింగ్‌స్టన్‌ రనౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (10 ఓవర్లలో 5 వికెట్లకు) 122; వికెట్ల పతనం: 1-2, 2-13, 3-69, 4-107, 5-122; బౌలింగ్‌: డేవిడ్‌ వీజ్‌ 2-0-6-1; ట్రంపుల్‌మన్‌ 2-0-31-2; బెర్నార్డ్‌ 2-0-24-1; ఎరాస్మస్‌ 2-0-26-0; బ్రాసెల్‌ 2-0-32-0

నమీబియా ఇన్నింగ్స్‌: లింజెన్‌ (బి) బ్రూక్‌ (బి) జోర్డాన్‌ 33; డేవిన్‌ రిటైర్డ్‌ ఔట్‌ 18; డేవిడ్‌ వీజ్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 27; ఎరాస్మస్‌ నాటౌట్‌ 1; స్మిట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (10 ఓవర్లలో 3 వికెట్లకు) 84; వికెట్ల పతనం: 1-44, 2-80, 3-82; బౌలింగ్‌: టాప్లీ 2-0-6-0; ఆర్చర్‌ 2-0-15-1; కరన్‌ 2-0-13-0; జోర్డాన్‌ 2-0-19-1; రషీద్‌ 2-0-29-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని