T20 World Cup: ఆసీస్‌ అజేయంగా..

7 ఓవర్లలో 89 పరుగులు! ఇదీ స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయ సమీకరణం. చిన్నజట్టే అయినా స్కాట్లాండ్‌ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్‌ చేస్తూ.. బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో  పొట్టి కప్‌లో మరో సంచలనం తప్పదేమో అనిపించింది.

Updated : 17 Jun 2024 06:49 IST

చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై విజయం
మెరిసిన స్టాయినిస్, హెడ్‌
గ్రోస్‌ ఐలీ (సెయింట్‌ లూసియా)

7 ఓవర్లలో 89 పరుగులు! ఇదీ స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయ సమీకరణం. చిన్నజట్టే అయినా స్కాట్లాండ్‌ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్‌ చేస్తూ.. బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో  పొట్టి కప్‌లో మరో సంచలనం తప్పదేమో అనిపించింది. కానీ స్టాయినిస్, హెడ్‌ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటంతో ఆసీస్‌కే విజయం దక్కింది. 

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయంగా గ్రూప్‌ దశను ముగించింది. ఆదివారం ఉదయం జరిగిన గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. మొదట మెక్‌ములెన్‌ (60; 34 బంతుల్లో 2×4, 6×6), కెప్టెన్‌ బెరింగ్టన్‌ (42 నాటౌట్‌; 31 బంతుల్లో 1×4, 2×6) రాణించడంతో స్కాట్లాండ్‌ 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (2/44) మెరిశాడు. ఛేదనలో హెడ్‌ (68; 49 బంతుల్లో 5×4, 4×6), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టాయినిస్‌ (59; 29 బంతుల్లో 9×4, 2×6) చెలరేగడంతో ఆసీస్‌ 5 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది. స్కాట్లాండ్‌ బౌలర్లలో మార్క్‌వ్యాట్‌ (2/34), షరీఫ్‌ (2/42) ఆకట్టుకున్నారు. 

ఛేదనలో కంగారు: ఛేదనలో స్కాట్లాండ్‌ సవాలును దాటి ఆసీస్‌ విజయతీరాలకు చేరింది. వార్నర్‌ (1), కెప్టెన్‌ మార్ష్‌ (8), మ్యాక్స్‌వెల్‌ (11) వికెట్లను కోల్పోయిన ఆ జట్టు 10 ఓవర్లకు 74/3తో నిలిచింది. ఓ ఎండ్‌లో ఓపెనర్‌ హెడ్‌ పాతుకుపోయినా మొదట్లో కావాల్సినంత వేగంగా ఆడలేకపోయాడు. స్టాయినిస్‌ కూడా కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. స్కాట్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 13 ఓవర్లలో స్కోరు 92/3 మాత్రమే. అప్పుడు స్కాట్లాండ్‌ సంచలన విజయం సాధిస్తుందేమో అనిపించింది. కానీ స్టాయినిస్‌ దంచుడు మొదలెట్టడం, హెడ్‌ కూడా దూకుడు అందుకోవడంతో ఆసీస్‌ ఒక్కసారిగా టాప్‌గేరులోకి వెళ్లిపోయింది. 14వ ఓవర్లో వరుసగా 6, 6, 4తో స్టాయినిస్‌ చెలరేగాడు. 16వ ఓవర్లో హెడ్‌ వరుసగా మూడు సిక్సర్లు రాబట్టాడు. ఆ వెంటనే హెడ్‌ ఔటైపోయాడు. 25 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్న స్టాయినిస్‌ మరో రెండు ఫోర్లు కొట్టి పెవిలియన్‌ చేరిపోయాడు. దీంతో ఉత్కంఠ రేగింది. కానీ సమీకరణం 18 బంతుల్లో 26 పరుగులుగా మారి, అందుబాటులోనే ఉండటంతో టిమ్‌ డేవిడ్‌ (24 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 1×6) ప్రశాంతంగా పని పూర్తిచేశాడు. సిక్సర్‌తో అతను మ్యాచ్‌ ముగించాడు. అంతకుముందు స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే వికెట్‌ పడ్డా.. మెక్‌ములెన్, మున్సీ (35; 23 బంతుల్లో 2×4, 3×6) కలిసి రెండో వికెట్‌కు 89 (48 బంతుల్లో) పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు. ఆసీస్‌ బౌలర్లను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా ఆ జంట బౌండరీలతో సాగిపోయింది. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో మున్సీ వరుసగా 6, 6, 4 సాధించాడు. మరోవైపు సిక్సర్లతో రెచ్చిపోయిన మెక్‌ములెన్‌ 26 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. కానీ స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరినీ ఔట్‌ చేసి ఆసీస్‌ పోటీలోకి వచ్చింది. చివర్లో ఉత్తమంగా బౌలింగ్‌ చేసింది. కానీ బెరింగ్టన్‌ ఆఖరి వరకూ నిలబడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు.. స్కాట్లాండ్‌: 180/5 (మెక్‌ములెన్‌ 60, బెరింగ్టన్‌ 42 నాటౌట్, మున్సీ 35; మ్యాక్స్‌వెల్‌ 2/44, జంపా 1/30); ఆస్ట్రేలియా: 186/5 (హెడ్‌ 68, స్టాయినిస్‌ 59, టిమ్‌ డేవిడ్‌ 24 నాటౌట్‌; మార్క్‌వ్యాట్‌ 2/34, షరీఫ్‌ 2/42)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని