T20 World Cup 2024: ఇంగ్లండ్‌ను అడ్డుకొనేందుకు.. ఆసీస్‌ అలా చేస్తే నిషేధం తప్పదు!

బలమైన ఇంగ్లండ్‌ జట్టు సూపర్ - 8 దశకు రాకుండా చేసే అవకాశం ఆస్ట్రేలియాతో చేతిలో ఉంది. ఆ జట్టు మాజీ కెప్టెన్‌ కూడా ఇదే విషయాన్ని మరో విధంగా చెప్పడంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Updated : 13 Jun 2024 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ - B నుంచి ఆస్ట్రేలియా సూపర్ - 8కి చేరింది.  రెండో జట్టుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో స్కాట్లాండ్, ఇంగ్లండ్‌ రేసులో ఉన్నాయి. అయితే, అందరి కళ్లూ ఆసీస్‌ - స్కాట్లాండ్‌ (జూన్ 16న) ఫలితంపైనే ఉంది. ఇంగ్లండ్‌ తర్వాత దశకు రాకుండా ఉండేలా.. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేయాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్ టిమ్‌ పైన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవేళ అలా చేస్తే మాత్రం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్  మార్ష్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రికెట్ నిబంధనలు చెబుతున్నాయి. అసలు పైన్ ఏం మాట్లాడంటే? 

‘‘నేనేదో జోక్‌ చేయడం లేదు. ఆసీస్‌ జట్టు తప్పకుండా తారుమారు చేయాలి. కొద్ది రోజుల కిందటే నేను ఈ మాట చెప్పా. అలాగని నేను ఆసీస్‌ ఓడిపోవాలని కోరుకోవడం లేదు. కానీ, స్కాట్లాండ్‌ను మరీ చెత్తగా ఓడించకూడదు. స్కాట్లాండ్‌ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మాకు 140 పరుగులను లక్ష్యంగా నిర్దేశిస్తే.. ఆసీస్ 19.5 ఓవర్లలో ఛేదిస్తే చాలు. అప్పుడు స్కాట్లాండ్‌ నెట్‌రన్‌రేట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంగ్లండ్ మాత్రం తన చివరి మ్యాచుల్లో కనీసం 50+ పరుగుల తేడాతోనైనా గెలవాల్సి ఉంటుంది. అప్పుడే స్కాట్లాండ్‌ రన్‌రేట్‌కు దగ్గరగా వస్తుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరుగుతుందని ఊహించడం కష్టమే’’ అని పైన్ వ్యాఖ్యానించాడు. 

అప్పుడు చర్యలు తప్పవు..

మ్యాచ్ ఫలితాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చాలని క్రికెటర్లు చూస్తే ఐసీసీ విధించే తీవ్రమైన చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఒకవేళ స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్ మిచెల్‌ మార్ష్ అలా చేస్తే మాత్రం నిషేధం ఎదుర్కోవడం ఖాయం. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్ 2.11 ప్రకారం కనీసం రెండు మ్యాచుల్లో నిషేధం పడుతుంది. ఇప్పుడు ఆసీస్ సూపర్ - 8కి చేరింది. అంటే ఆ జట్టు తదుపరి దశలో ఆడబోయే మూడు మ్యాచుల్లో రెండింటికి మార్ష్‌ దూరం కావాల్సి ఉంటుంది. కాబట్టి, ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోవడానికి ఆసీస్‌ జట్టు సిద్ధంగా ఉండదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

ఇదీ పరిస్థితి..

ఆసీస్‌ మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక స్కాట్లాండ్ (5 పాయింట్లు) మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక రద్దుతో  రెండో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌ను ఆసీస్‌తో (జూన్ 16న) తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ భారీ తేడాతో ఓడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. మరోవైపు నమీబియా, ఒమన్‌కు అవకాశాలు లేవు. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు పెద్దగా కలిసిరాలేదు. రెండు మ్యాచుల్లో ఒకటి రద్దు కాగా.. మరొకదాంట్లో ఓటమి ఎదురైంది. మరో రెండు మ్యాచుల్లో ఒమన్, నమీబియాతో ఆడనుంది. ఈ రెండింట్లోనూ గెలిచినా స్కాట్లాండ్‌ (+2.164) నెట్‌ రన్‌రేట్‌ కంటే ఇంగ్లండ్‌ (ప్రస్తుతం -1.800) అధిగమించడం చాలా కష్టం. అలా జరగాలంటే తన రెండు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్‌ భారీ తేడాతో గెలిచి.. అదే సమయంలో స్కాట్లాండ్‌ తన చివరి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కోవాలి. ఇదంతా ఆసీస్‌ చేతిలో ఉంది. ఎందుకంటే స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో కంగారూల జట్టు కొద్ది తేడాతో గెలిచినా.. ఇంగ్లండ్‌ ఇంటిముఖం పట్టక తప్పదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని