IND vs AUS: టీమ్‌ఇండియాతో జాగ్రత్త.. సహచరులను హెచ్చరించిన ఆసీస్‌ కెప్టెన్

ఒక్క ఓటమితో సెమీస్ అవకాశాలను ఆస్ట్రేలియా సంక్లిష్టం చేసుకుంది. సూపర్-8 పోరులో చివరి మ్యాచ్‌లో భారత్‌తో ఆసీస్‌ ఆడనుంది.

Published : 23 Jun 2024 16:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-8 పోరులో ఆస్ట్రేలియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. అఫ్గానిస్థాన్‌ సంచలన ప్రదర్శనతో విజయం సాధించింది. దీంతో సెమీస్‌ రేసు ఆసక్తికరంగా మారిపోయింది. తన చివరి మ్యాచ్‌లో భారత్‌ను ఆసీస్‌ ఢీకొట్టనుంది. సోమవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్‌ జరగనుంది. ఇందులో నెగ్గి.. తన ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్‌ ఓడితేనే ఆసీస్‌ సెమీస్‌కు వస్తుంది. లేకపోతే నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారనుంది. ఈ క్రమంలో తన జట్టు సహచరులకు కెప్టెన్ మిచెల్‌ మార్ష్ హెచ్చరికలు జారీ చేశాడు. భారత్‌ వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్ రేసులో చాలా ముందుంది. 

‘‘మేం ఏం చేయాలనేదానిపై మాకు స్పష్టత ఉంది. మా చివరి మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాలి. అయితే, భారత్‌ వంటి పెద్ద జట్టుతో తలపడనున్నాం. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సెమీస్‌ అవకాశాలు గల్లంతు అవుతాయి. ఇవాళ అఫ్గానిస్థాన్‌ అద్భుతమైన పోరాటంతో మమ్మల్ని ఓడించింది. తొలుత మేం బౌలింగ్‌లో 20 పరుగులు అదనంగా ఇచ్చామని అనుకుంటున్నా. మా ఆటతీరుతో పోలిస్తే అఫ్గాన్‌ ప్లేయర్లు చాలా బాగా ఆడారు. టాస్‌ ఇక్కడ కీలకం కాదనేది నా అభిప్రాయం. చాలా జట్లు వరల్డ్‌ కప్‌లో తొలుత బౌలింగ్‌ చేసి విజయం సాధించాయి. చివరి మ్యాచ్‌లో గెలవడంపైనే ఇక దృష్టిపెడతాం’’ అని మార్ష్ వ్యాఖ్యానించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 148/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ 127 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కంగారూల జట్టుపై అఫ్గాన్‌ తొలి విజయాన్ని నమోదు చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని