Australia Tour of Pakistan: పాక్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. 24 ఏళ్ల తర్వాత!

సుదీర్ఘ కాలం అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పాక్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్‌ ఆడనుంది......

Published : 09 Nov 2021 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘ కాలం అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పాక్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్‌ ఆడనుంది. దీంతో 24 ఏళ్ల విరామానికి తెరపడనుంది. చివరిసారి 1998లో ఆసీస్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల పలుమార్లు పాక్‌ పర్యటను ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. 2002 పాక్‌లో పర్యటించాల్సిన ఉండగా.. కరాచీలో ఆత్మాహుతి బాంబు దాడి జరగడంతో ఆ పర్యటను రద్దు చేసుకుంది. 2008లో పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆసీస్‌ తన పర్యటనను మరోసారి రద్దు చేసుకుంది.

‘ఆసీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనుండటం అంతులేని ఆనందాన్నిస్తోంది. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆస్ట్రేలియా.. 24 ఏళ్ల తర్వాత మా గడ్డపై ఆడటం అభిమానులకు పండగే’ అని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ రమీజ్‌ రాజా వెల్లడించారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు మాత్రం పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ‘ఆస్ట్రేలియా వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. అందుకోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అని ఆసీస్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిక్‌ హాక్లే వెల్లడించారు. అయితే ఈ టూర్‌ అయినా విజయవంతంగా కొనసాగాలని పాక్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

గత సెప్టెంబర్‌లో పాక్‌ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్‌ జట్టు.. భద్రతా కారణాల దృష్ట్యా ఆ సిరీస్‌ను అకస్మాతుగా రద్దు చేసుకుంది. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే స్వదేశానికి వెళ్లిపోయింది. 18 ఏళ్ల విరామం తర్వాత పాకిస్థాన్‌కు వచ్చిన కివీస్‌.. తొలి వన్డే ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు తన నిర్ణయాన్ని ప్రకటించి హుటాహుటిన తిరిగి వెళ్లిపోయింది. ఇంగ్లాండ్‌ సైతం ఈ తరహా నిర్ణయమే తీసుకుంది. గత అక్టోబరులో ఇంగ్లాండ్ పురుషులు, మహిళల క్రికెట్ జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉండగా.. పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీబీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని