Australia Captaincy: మళ్లీ అతడికే పూర్తిస్థాయి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలి: బ్రాడ్‌ హాగ్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు జట్టను చేర్చడంలో స్టీవ్‌ స్మిత్ కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో (IND vs AUS) 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Published : 09 Mar 2023 19:27 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) వరుసగా రెండు ఓటములతో కుంగిపోయిన ఆస్ట్రేలియాను (IND vs AUS) స్టీవ్‌ స్మిత్  విజయపథంలో నడిపించాడు. మూడో టెస్టులో రెగ్యులర్‌ సారథి ప్యాట్ కమిన్స్‌ అత్యవసరంగా స్వదేశం వెళ్లడంతో వైస్‌ కెప్టెన్‌ స్మిత్  సారథ్యం వహించాడు. ప్రస్తుతం నాలుగో టెస్టుకు కూడా అతడే నాయకత్వం వహిస్తున్నాడు. మూడోటెస్టులో జట్టును అద్భుతంగా నడిపి గెలిపించిన స్మిత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్యాట్‌ కమిన్స్‌ను తప్పించి స్మిత్‌నే పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించాలనే డిమాండ్లూ వచ్చాయి. గతంలో సాండ్‌పేపర్ స్కాం బయటపడటంతో స్మిత్‌పై వేటు పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు స్మిత్ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు మూడో టెస్టులో ఆసీస్‌ను గెలిపించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లడంతో కెప్టెన్సీ రేసులో స్మిత్‌కు మద్దతు పెరిగిపోయింది. తాజాగా ఆసీస్‌ మాజీ టాప్‌ స్పిన్నర్‌ బ్రాడ్ హాగ్‌ కూడా ఇదే విషయంపై స్పందించాడు. 

‘‘స్టీవ్‌ స్మిత్‌ పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఉండాలి. మూడు ఫార్మాట్లలోనూ ఆడే ఫాస్ట్‌బౌలర్లకు కాస్త విశ్రాంతిని ఇవ్వాల్సిందే. ఈ నెల చివరి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లోనూ ప్యాట్‌ కమిన్స్ ఆడతాడు. దీంతో అతడిపై వర్క్‌లోడ్‌ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఫాస్ట్‌ బౌలర్లను ఒత్తిడికి గురి చేస్తుంది. లేకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ఆందోళనగా మారే అవకాశం లేకపోలేదు’’ అని బ్రాడ్ హాగ్‌ తెలిపాడు. మూడో టెస్టులో 9 వికెట్లతో భారత్‌పై ఆసీస్‌ విజయం సాధించింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని