IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్‌ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్‌ హీలీ

మరో వారం రోజుల్లో టీమ్‌ఇండియా - ఆసీస్ (IND vs AUS) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆసీస్‌ కూడా భారత్‌కు చేరుకొంది.

Published : 02 Feb 2023 17:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. నాగ్‌పుర్‌ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. వార్మప్ మ్యాచ్‌ లేకుండా.. కేవలం ఇరు జట్లూ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రమే పాల్గొంటాయి. భారత్‌ వేదికగా జరిగే సిరీస్ కాబట్టి స్పిన్‌ పిచ్‌లనే తయారు చేసి పర్యాటక జట్టును ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. ఈ క్రమంలో ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం ఇయాన్‌ హీలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కల్పించకపోవడంపై ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన హీలీ.. సరైన పిచ్‌లను రూపొందిస్తే మాత్రం ఆసీస్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పాడు. 

‘‘ఒకవేళ భారత్‌ పిచ్‌లు ఇరు జట్లకూ సహకారం లభించేలా తయారు చేస్తే.. అంటే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, నిలకడగా స్పిన్‌ బౌలింగ్‌ను సంధించేలా పిచ్‌లను రూపొందించాలి. అప్పుడు ఆసీస్‌ తప్పకుండా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. కానీ, నాకున్న ఒకే ఒక్క ఆందోళన మిచెల్‌ స్టార్క్, నాథన్ లియాన్‌ బౌలింగ్‌పైనే ఉంది. గత సిరీస్‌లో సరైన పిచ్‌లను రూపొందించలేదు. దీంతో తొలి రోజు నుంచే బంతి బౌన్స్‌ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మాకంటే భారత్‌ చాలా చక్కగా ఆడగలుగుతుంది’’

‘‘భారత్‌లో పది వికెట్లు తీయడానికి పది అవకాశాలు మాత్రమే ఉంటాయి. అదే ఆసీస్‌లో అయితే బౌన్స్‌, బంతి ముందుకు కదలడం, వేగం.. ఇలా 13 అవకాశాలు దొరుకుతాయి. వాటిల్లో కొన్ని వృథా అయినా నష్టం లేదు. కానీ భారత్‌లో మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. భారత్‌లో ఎంత ఒత్తిడి ఉన్నా సరే తట్టుకోగలరు. ఇదే సూత్రాన్ని ఆసీస్ ఆటగాళ్లూ వర్తింపజేసుకోవాలి’’ అని ఇయాన్‌ హీలీ తెలిపాడు. 2004 నుంచి భారత్‌లో ఆసీస్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా గెలుచుకోలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని