IND vs AUS: నాథన్.. కుర్రాడిలా ఉన్నావ్‌.. అప్పటి వరకు ఆడు: మైక్ హస్సీ

మూడో టెస్టులో స్పిన్‌ పిచ్‌ను ఆసీస్‌ బౌలర్‌ నాథన్‌ లయన్ (Nathan Lyon) చక్కగా వినియోగించుకుని మరీ భారత్‌ను (IND vs AUS) దెబ్బకొట్టాడు. దీంతో  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC) దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

Published : 08 Mar 2023 00:35 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) నాగ్‌పుర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో  నాథన్‌ లయన్ (Nathan Lyon)మాత్రం ఒక్క వికెట్‌ తీయలేదు. కానీ, తర్వాతి రెండు టెస్టుల్లో (IND vs AUS) ఏకంగా 18 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడీ ఆసీస్‌ సీనియర్‌ స్పిన్నర్. మూడో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి భారత్‌ భరతం పట్టాడు. కేవలం 12 ఏళ్ల తన టెస్టు కెరీర్‌లో 479 వికెట్లు పడొగొట్టిన నాథన్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 35 ఏళ్ల ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ ఇప్పటి వరకు 118 టెస్టులు ఆడాడు. ఈ క్రమంలో నాథన్‌ లయన్‌ తన కెరీర్‌ను మరింత కాలం కొనసాగించాలని ఆసీస్‌ మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ సూచించాడు. 

‘‘లయన్ ఎంతకాలం వరకు ఆడాలని భావిస్తే.. అప్పటి వరకు కొనసాగాలి. సుదీర్ఘం కాలం నుంచి ఆడుతున్నప్పటికీ ఇంకా యంగ్‌గానే కనిపిస్తున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నా.. వయస్సు పెరుగుతుందే కానీ  అతడి శరీరం మాత్రం అలాగే ఉండిపోయింది. చాలామంది చెప్పినట్లు.. స్పిన్నర్లు 30ల్లో కానీ తమ కెరీర్‌ ఉన్నత స్థాయికి వెళ్లరు. మరీ ముఖ్యంగా 30 దాటాక ఇంకా వేగంగా ఉంటుందేమో..  స్పిన్‌ బౌలింగ్‌ చాలా క్లిష్టమైందే. అయితే, నాథన్‌ మాత్రం సుదీర్ఘకాలం ఆడుతూ ముందుకు సాగాలి’’ అని మైక్‌ హస్సీ తెలిపాడు. 

నాథన్‌కు సరైన భాగస్వామి బౌలర్‌గా మ్యాట్ కునెమన్‌ అయితేనే బాగుంటుందని హస్సీ అభిప్రాయపడ్డాడు. టాడ్‌ మర్ఫీ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ.. తాను కునెమన్‌ వైపే మొగ్గు చూపుతానని వెల్లడించాడు. ‘‘ టాడ్‌ మర్ఫీ సూపర్ బౌలర్. అతడి బౌలింగ్‌ నన్నెంతో ఆకట్టుకుంది. ఇక కునెమన్‌ కూడా అద్భుతంగా వేస్తున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఎంపిక ఏమాత్రం ఇబ్బందిలేదు. కానీ, ఇద్దరినే తుది జట్టులోకి తీసుకుంటే మాత్రం నేను కునెమన్‌ వైపే మొగ్గు చూపుతా. ఎందుకంటే బ్యాటర్‌కు వ్యతిరేక దిశలోనూ బంతిని టర్న్‌ చేయగల సమర్థుడు’’ అని మైక్ చెప్పాడు. మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని