WTC Final: ‘ఐసీసీ ఏం చేస్తోంది.. అప్పటి వరకు అభిమానుల ఆసక్తి తగ్గుతుంది’

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ (WTC Final)ను జూన్‌లో నిర్వహించనుండటంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ బ్రాడ్ హాగ్‌ ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 15 Mar 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీని టీమ్‌ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ (WTC Final) బెర్తులు ఖరారు కావడంలో ఈ సిరీస్‌ కీలకంగా మారింది. మూడో టెస్టు గెలుపొంది ఆసీస్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో భారత్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. జూన్‌ 7-11 మధ్య లండన్‌లోని ది ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ను జూన్‌లో నిర్వహించాలని ఐసీసీ (ICC) తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ బ్రాడ్ హాగ్ (Brad Hogg) అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘ఐసీసీ ఏం చేస్తోంది? ముఖ్యమైన మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి.   WTC ఫైనల్ కోసం 3 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా సుదీర్ఘ విరామం ఇస్తే అభిమానులకు టెస్టు క్రికెట్‌పై ఆసక్తి తగ్గుతుంది. దయచేసి ఐసీసీ మేల్కొవాలి. అభిమానుల్లో ఇప్పుడు ఉన్న ఉత్సాహం అప్పటివరకు (జూన్‌) ఉండదు. IPL ముగిసిన తర్వాత  డబ్ల్యూటీసీ ఫైనల్ వచ్చే సమయానికి చాలా జట్లు తమ మ్యాచ్‌లతో బిజీగా ఉంటాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఇతర దేశాల అభిమానులు ఆసక్తి చూపకపోవచ్చు. మే 21 వరకు ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపు ఆరు జట్లు నిష్క్రమిస్తాయి. కాబట్టి, అందుబాటులో ఉన్న మా ఆటగాళ్లను గుర్తించి వారిని వీలైనంత తొందరగా యూకేకు తీసుకురావడానికి మేం ప్రయత్నిస్తాం. కొంత సమయం తీసుకుని ఆటగాళ్లను పర్యవేక్షిస్తాం’ అని బ్రాడ్ హాగ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 16 సీజన్‌ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మే 28న ఫైనల్‌ను నిర్వహించునున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని