IND vs AUS: తుది జట్టులో మార్పు చేయడమే టీమ్‌ఇండియాకు నష్టం: హేడెన్

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) అనూహ్యంగా భారత్‌ మూడో టెస్టు మ్యాచ్‌లో చతికిల పడింది. స్పిన్‌ పిచ్‌పై బోల్తా పడటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Published : 04 Mar 2023 19:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్పిన్‌ పిచ్‌ల మీద ప్రత్యర్థి బ్యాటర్లను గింగిరాలు తిప్పేస్తున్న టీమ్‌ఇండియాకు (Team India).. ఇందౌర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో (IND vs AUS) మాత్రం ఆసీస్‌ చేతిలో ఓటమితప్పలేదు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. స్పిన్‌ మంత్రంలో భారత్‌ కొట్టుకుపోయింది. ఆసీస్ (Australia) బ్యాటర్లు రాణించిన చోట.. టీమ్‌ఇండియా తేలిపోవడంపై విమర్శలు రేగాయి. భారత బ్యాటర్లతో పిచ్‌ ఆటాడుకుందని క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) వ్యాఖ్యానించాడు. అయితే, దీనింతటికీ కారణం జట్టులో ఒక్కసారిగా మార్పులు చేయడమేనని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్‌ (Matthew Hayden) వ్యాఖ్యానించాడు.

‘‘మూడో టెస్టు నుంచి కేఎల్ రాహుల్‌ను తప్పించారు. ఇలాంటి విషయాలే మిగతా ఆటగాళ్లను అస్థిరపరిచేలా చేస్తాయి. తమ స్థానం కోసం మాత్రమే ఆటగాళ్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి అవకాశం కల్పించడం వల్ల వారి మైండ్‌సెట్‌లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. అదే ఆసీస్‌ బ్యాటింగ్‌ను చూస్తే చాలా ముచ్చటేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్ల యాటిట్యూడ్‌ బాగుంది. కేవలం రెండు ఓవర్లలోనే 20 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను తమవైపు తిప్పేసుకున్నారు’’ అని హేడెన్‌ తెలిపాడు. భారత్ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో బంతికే ఆసీస్‌ ఉస్మాన్ ఖావాజా (0) డకౌట్‌ కాగా.. ట్రావిస్‌ హెడ్‌, లబుషేన్ మరో వికెట్‌ను పడనీయకుండా ఆసీస్‌ను గెలిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని