Ashes Test Series: యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌.. రెండో టెస్టు.. రెండో రోజు ఆట సాగిందిలా.!

అడిలైడ్ వేదికగా సాగుతున్న రెండో టెస్టు రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. 221/2 ఓవర్‌ నైట్ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన ఆసీస్‌.. 473/9 స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ని..

Published : 17 Dec 2021 20:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. 221/2 ఓవర్‌ నైట్ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన ఆసీస్‌.. 473/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ని ముగించింది. ఆసీస్ ఆటగాడు మార్నస్ లబూషేన్‌ (103: 305 బంతుల్లో 8x4) శతకంతో రాణించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (95: 167 బంతుల్లో 11x4), కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ (93: 201 బంతుల్లో 12x4, 1x6) త్రుటిలో శతకాలు చేజార్చుకున్నారు. అలెక్స్‌ కేరీ (51) అర్ధ శతకంతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ మూడు, జేమ్స్ అండర్సన్‌ రెండు, స్టువర్ట్ బ్రాడ్‌, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్‌, జో రూట్‌ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే వరుస షాక్‌లు తగిలాయి. మూడో ఓవర్లో రోరీ బర్న్స్‌ (4) ఔట్ కాగా.. ఏడో ఓవర్లో మరో ఓపెనర్ హసీబ్ హమీద్‌ (6) కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో రెండో రోజు ఆటముగిసే సరికి ఇంగ్లాండ్‌ 17/2 స్కోరుతో నిలిచింది. డేవిడ్‌ (1), జో రూట్ (5) క్రీజులో ఉన్నారు.    

* ఇంగ్లాండ్‌ ఓపెనర్లను ఔట్ చేశారిలా..

రెండో రోజు ఆట ముగిసే కొద్ది సమయం ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ని ఆపేసింది. అప్పటికీ ఆస్ట్రేలియా స్కోరు 473/9. ఇంగ్లాండ్‌ ఓపెనర్లను త్వరగా ఔట్‌ చేస్తే.. మూడో రోజు ఆట సులభమవుతుందనే ఉద్దేశంతో ఆసీస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అనుకున్నట్లుగానే స్వల్ప వ్యవధిలోనే ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్‌ చేర్చి ఆసీస్‌ పైచేయి సాధించింది. మిచెల్‌ స్టార్క్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి రోరీ బర్న్స్‌ (4).. స్టీవెన్ స్మిత్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. కొద్ది సేపటికే మరో ఓపెనర్‌ హసీబ్‌ హమీద్ (6) కూడా మైఖేల్ నేసర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో టెస్టుల్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. నేసర్‌ వేసిన రెండో బంతికే వికెట్ పడగొట్టడం విశేషం.

Read latest Sports News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని