T20 World Cup: ఆసీస్‌ అలవోకగా..

ఆస్ట్రేలియాకు ఎదురేలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు దూసుకుపోతోంది. వరుసగా మూడో విజయంతో సూపర్‌-8లో అడుగుపెట్టింది.

Updated : 13 Jun 2024 03:07 IST

నమీబియాపై విజయంతో సూపర్‌-8కు

నార్త్‌సౌండ్‌: ఆస్ట్రేలియాకు ఎదురేలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు దూసుకుపోతోంది. వరుసగా మూడో విజయంతో సూపర్‌-8లో అడుగుపెట్టింది. లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (4/12) మాయ చేయడంతో బుధవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో పసికూన నమీబియాను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా.. కంగారూ బౌలర్ల ధాటికి కుదేలైపోయింది. జంపాతో పాటు హేజిల్‌వుడ్‌ (2/18), స్టాయినిస్‌ (2/9) విజృంభించడంతో 17 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. ఎరాస్మస్‌ (36) ఒక్కడు రాణించకపోతే నమీబియా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదే. ఆ జట్టులో ఎరాస్మస్‌ కాకుండా లింగెన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు. ట్రావిస్‌ హెడ్‌ (34; 17 బంతుల్లో 5×4, 2×6), మిచెల్‌ మార్ష్‌ (18 నాటౌట్‌; 9 బంతుల్లో 3×4, 1×6) చెలరేగడంతో స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ కేవలం 36 బంతుల్లో ఛేదించింది. వార్నర్‌ 20 పరుగులు చేశాడు. గ్రూపులో అగ్రస్థానంలో ఉన్న కంగారూ జట్టు మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సూపర్‌-8లో ప్రవేశించింది. నమీబియా: 72 (ఎరాస్మస్‌ 36, లింగెన్‌ 10, ట్రంపుల్‌మ్యాన్‌ 7, స్మిట్‌ 3; జంపా 4/12, హేజిల్‌వుడ్‌ 2/18, స్టాయినిస్‌ 2/9) ఆస్ట్రేలియా: 74/1 (హెడ్‌ 34 నాటౌట్, మార్ష్‌ 18 నాటౌట్, వార్నర్‌ 20)

నేపాల్, శ్రీలంక మ్యాచ్‌ రద్దు: శ్రీలంక, నేపాల్‌ మధ్య బుధవారం జరగాల్సిన గ్రూప్‌-డి మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రద్దయింది. రెండు జట్లకూ చెరో పాయింట్‌ లభించాయి. ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక ఓడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు