WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆసీస్‌.. భారత్‌ సమీకరణాలు ఇలా..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC 2023) ఫైనల్‌కు ఆసీస్‌ దూసుకెళ్లింది. ఇక రెండో స్థానంలో నిలిచిన భారత్‌కు (Team India) శ్రీలంక నుంచి ముప్పు వాటిల్లేలా ఉంది. కివీస్‌పై 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను (SL vs NZ) లంక గెలిస్తే.. భారత్‌ ఆశలకు అడ్డుకట్ట పడుతుంది.

Published : 03 Mar 2023 13:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో ఆసీస్‌కు (Australia) తొలి విజయం దక్కింది. మూడు రోజు తొలి సెషన్‌లోపే ముగిసిన మ్యాచ్‌లో భారత్‌పై 9 వికెట్ల తేడాతో (IND vs AUS) గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. వరుసగా రెండు టెస్టులను ఓడిపోయినప్పటికీ.. మూడో టెస్టులో విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిపోవడం విశేషం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసీస్‌ 68.52 పర్సేంటేజీతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టీమ్‌ఇండియా 60.29 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (52.38) భారత్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

భారత్‌ సమీకరణాలు ఇలా...

* మార్చి 9 నుంచి న్యూజిలాండ్‌ - శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందులో శ్రీలంక విజయం సాధిస్తే మాత్రం భారత్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఒకవేళ ఆసీస్‌పై నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు మనదే అవుతుంది.

* కివీస్‌పై లంక 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి.. టీమ్‌ఇండియా నాలుగో టెస్టులో ఓడితే మాత్రం ఆశలు గల్లంతు అయినట్లే. అప్పుడు శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరదామని భావిస్తున్న భారత్‌కు చుక్కెదురువుతుంది. 

* శ్రీలంక కనీసం ఒక్క టెస్టు ఓడిపోయినా సరే భారత్‌ ముందంజ వేయడం ఖాయం. అప్పుడు ఆసీస్‌పై నాలుగో టెస్టు గెలిస్తే టీమ్‌ఇండియా అగ్రస్థానంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. 

* మార్చి 9 నుంచి ఆసీస్‌తో జరిగే నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. అలాగే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని