Cricket News: అక్కడే మారిపోయా: సిరాజ్‌

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తన వైఖరి పూర్తిగా మారిపోయిందని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారని.......

Published : 02 Jun 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తన వైఖరి పూర్తిగా మారిపోయిందని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారని.. అత్యంత ఆరోగ్యకరమైన పోటీ ఉందని పేర్కొన్నాడు. సీనియర్లు తనకు విలువైన సలహాలు ఇస్తున్నారని వెల్లడించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు దొరకుతుందో లేదో తెలియదన్నాడు.

టీమ్‌ఇండియా త్వరలో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడుతుంది. నెల రోజుల సాధన తర్వాత ఆంగ్లేయులతో ఐదు టెస్టుల సిరీసు ఆడుతుంది. ఈ పర్యటనకు సిరాజ్‌ సిద్ధమయ్యాడు. జట్టు సభ్యులతో కలిసి ముంబయిలో క్వారంటైన్‌ అయ్యాడు. తక్కువ సమయంలోనే అతడు జట్టులో కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

‘ఆస్ట్రేలియా పర్యటన నా కెరీర్లోనే అత్యుత్తమ సందర్భం. అది నన్నెంతో మార్చింది. బౌలింగ్‌ పట్ల పూర్తిగా నా వైఖరిని మార్చేసింది. ప్రస్తుత భారత జట్టులో భాగమవ్వడం గొప్ప అనుభూతి. స్వదేశమైనా విదేశమైనా.. ఎక్కడైనా టీమ్‌ఇండియా ఎవరినైనా ఓడించగలదు. ఇలాంటి పటిష్ఠమైన జట్టులో చోటుకోసం పోటీ ఉండటం వ్యక్తిగతంగా నేను ఆస్వాదిస్తున్నా. సీనియర్లంతా చాలా మంచివారు. విలువైన సలహాలు ఇస్తుంటారు. పేస్‌ బౌలింగ్‌ కళ నేర్చుకొనేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో చోటు దొరుకుతుందో లేదో నిజంగా నాకు తెలియదు. మెరుగ్గా బౌలింగ్‌ చేసేందుకు, అవకాశం దొరికితే ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని సిరాజ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని