రోహిత్‌ను అడ్డుకొంటాం!

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ ఒకరని ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ అన్నాడు. అతడి రాక ప్రత్యర్థి బౌలర్లకు సవాలేనని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ సవాల్‌కు తాము సిద్ధమేనని వెల్లడించాడు. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు పక్కా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ...

Published : 05 Jan 2021 02:18 IST

ప్రణాళికలు సిద్ధం చేశామన్న లైయన్‌

సిడ్నీ: ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ ఒకరని ఆస్ట్రేలియా సీనియర్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ అన్నాడు. అతడి రాక ప్రత్యర్థి బౌలర్లకు సవాలేనని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ సవాల్‌కు తాము సిద్ధమేనని వెల్లడించాడు. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు పక్కా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ లక్ష్యం మాత్రం మూడో టెస్టు గెలవడమేనని తెలిపాడు.

‘అత్యుత్తమ ఆటగాడైన రోహిత్‌ శర్మ బౌలర్లకు సవాల్‌గా నిలుస్తాడు. మేం ఆ సవాల్‌కు సిద్ధంగా ఉన్నాం. అతడు రావడం టీమ్‌ఇండియాకు గొప్ప ఊరట. అయితే జట్టులోంచి ఎవరిని తొలగిస్తారన్నది ఆసక్తికరం. హిట్‌మ్యాన్‌ను అడ్డుకొనే ప్రణాళికలను మేం సిద్ధం చేసుకున్నాం. అతడిని గౌరవిస్తూనే త్వరగా ఔట్‌ చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని లైయన్‌ అన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న అజింక్య రహానెపై లైయన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

‘అజింక్య రహానె ప్రపంచస్థాయి బ్యాటర్‌. తన బ్యాటింగ్‌తో అతడు జట్టును అన్ని విధాలా ఆదుకుంటున్నాడు. క్రీజులో అతడి ఓపికను బట్టి అతిగా చిరాకు పడడని అర్థమవుతోంది. ఆట మధ్యలో అతడు స్లెడ్జింగ్‌కు దిగడు. చర్చకు తావివ్వడు. ప్రశాంతంగా తన పనికానిచ్చేస్తాడు. కోహ్లీ గైర్హాజరీలో నాయకుడిగా అతడు జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సిడ్నీలో అతడిని అడ్డుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ స్ట్రెయిట్‌గా బంతులేస్తూ మా బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. సిడ్నీలో అతడిని ఎదుర్కోవడంపై మావాళ్లు దృష్టి సారించారు. టీమ్‌ఇండియా బ్యాటర్లు నా బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతున్నారు’ అని లైయన్‌ అన్నాడు.

క్వారంటైన్‌ నిబంధనల వల్ల గబ్బాలో టీమ్ఇండియా చివరి టెస్టు ఆడకపోవచ్చన్న వార్తలపై లైయన్ ‌స్పందించాడు. ఏదేమైనా బ్రిస్బేన్‌లో 100% టెస్టు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ‘నిజం చెప్పాలంటే రెండు జట్లలోని కొందరు ఆరు నెలలుగా బయో బుడగల్లో ఉంటున్నారు. నా దృష్టిలో అయితే ఇదొక చిన్న త్యాగం. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మోముపై చిరునవ్వుల కోసం మేం ప్రేమించే ఆటను ఆడుతున్నాం. బయట వచ్చిన వార్తల గురించి మేం పట్టించుకోవడం లేదు. నియంత్రించగలిగే వాటిపైనే మా ఆందోళన. డేవిడ్‌ వార్నర్‌ ఇకపై మ్యాచుల్లో ఎక్స్‌ఫ్యాక్టర్‌ అనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నాడు.

ఇవీ చదవండి
రోహిత్‌శర్మ సహా.. అందరికీ కరోనా నెగెటివ్‌
రద్దా? యథావిధిగా బ్రిస్బేన్‌ టెస్టు!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని