Australian Open: అలా చేయకపోతే జకోవిచ్‌ ఇంటికే..!

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సరైన కారణం చూపితేనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడతారని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ వెల్లడించారు.

Published : 06 Jan 2022 01:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సరైన కారణం చూపితేనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడతారని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ వెల్లడించారు.  జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొననున్నారనే విషయంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ టోర్నిలో పాల్గొనేవారు కచ్చితంగా టీకా తీసుకోవడం కానీ, నిపుణుల కమిటీని సంప్రదించి మినహాయింపు పొందడంగానీ చేయాలి. కానీ, తన వ్యాక్సినేషన్‌స్థితిపై ఇప్పటి వరకు జొకోవిచ్‌ స్పందించలేదు. గతేడాది మాత్రం వ్యాక్సిన్‌కు వ్యతిరేకమని ప్రకటించారు. తాజాగా వస్తున్న వ్యతిరేకతపై ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అధికారులు స్పందించారు. జొకోవిచ్‌కు ఎటువంటి ప్రత్యేక అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌లు చవిచూసినా.. రోజువారీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.  ఇప్పటికే ఆస్ట్రేలియాలో 16 ఏళ్లు దాటిన వారిలో 90శాతం మందికి పూర్తిస్థాయిలో టీకాలు అందాయి. కానీ, చాలా మంది ఆస్ట్రేలియన్లు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లడంలేదు.  జొకోవిచ్‌  వ్యవహారంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పందిస్తూ.. ‘‘జొకోవిచ్‌ వ్యాక్సిన్‌ నుంచి మినహాయింపు పొందడానికి సరైన కారణం చూపితేనే టోర్నిలో ఆడతారు.. లేకపోతే తర్వాతి విమానంలోనే ఇంటికి పోతారు’’ అని వ్యాఖ్యానించారు.  అతని కోసం ప్రత్యేక నిబంధనలు ఏవీ లేవని కుండబద్దలు కొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని