Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్‌..మహిళల విభాగంలో టాప్‌ సీడ్‌లకు చుక్కెదురు

ఆస్ట్రేలియా ఓపెన్‌ సింగిల్స్‌ మహిళల సీడెడ్‌ ప్లేయర్లకు చుక్కెదురైంది. టాప్‌ క్రీడాకారిణులు...

Published : 20 Jan 2022 23:25 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ సింగిల్స్‌ మహిళల విభాగంలో టాప్‌ సీడెడ్‌ ప్లేయర్లకు చుక్కెదురైంది. టాప్‌ క్రీడాకారిణులు ఎమ్మా రదుకాను, ముగురుజ, కొంటావెల్ట్‌ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌ 3 ర్యాంకర్‌ గార్బిన్‌ ముగురుజ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఫ్రెంచ్ టెన్నిస్‌ ప్లేయర్‌ అయిన అలీజె కార్నెట్ చేతిలో 6-3, 6-3 తేడాతో ముగురుజ ఓటమి పాలైంది. వరుసగా రెండు సెట్లలోనూ ముగురుజ బ్రేక్‌ పాయింట్ సాధించలేకపోయింది. దాదాపు 33 అనవసర తప్పిదాలు చేయడంతో ఓడిపోవాల్సి వచ్చింది. ‘‘నా ఆట తీరుపట్ల ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యర్థి బాగా ఆడింది. అయితే రెండో రౌండ్‌లోనే ఓటమితో నిరుత్సాహానికి గురయ్యా’’ అని ముగురుజ పేర్కొంది. ప్రస్తుతం కార్నెట్‌ 61వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. 

యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌కూ తప్పని ఓటమి

యూఎస్‌ ఛాంపియన్‌ ఎమ్మా రదుకాను 17వ సీడెడ్‌ క్రీడాకారిణిగా ఆస్ట్రేలియా ఓపెన్‌ బరిలోకి దిగింది. అయితే మాంటెనెగ్రో ప్లేయర్‌ దన్‌కా కొవినిక్‌ చేతిలో ఓటమిపాలైంది. రెండో రౌండ్‌లో 6-4, 4-6, 6-3 తేడాతో రదుకానుపై కొవినిక్‌ విజయం సాధించింది. కొవినిక్‌ అంతర్జాతీయ ర్యాంక్‌ 98 కావడం గమనార్హం. తొలి రౌండ్‌లో 2017 యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అయిన స్లోనే స్టీఫెన్స్‌ను రదుకాను ఓడించిన విషయం తెలిసిందే. ఇక ఆరో సీడ్‌ కొంటావెల్ట్‌ (ఇస్తోనియా) 2-6, 4-6 తేడాతో టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. ఇక నంబర్ 2 సీడెడ్‌ సబాలెంక (బెలారస్) 1-6, 6-4, 6-2 తేడాతో వాంగ్‌ (చైనా)పై గెలుపొందింది. ఏడో సీడ్‌ క్రీడాకారిణి స్వైతెక్ (పొలాండ్) 6-2, 6-2 తేడాతో స్వీడన్‌కు చెందిన ఆర్‌ పీటర్సన్‌పై విజయం సాధించింది.

పురుషుల విభాగంలో.. 

రష్యన్‌ ఆటగాడు, రెండో సీడెడ్‌ ప్లేయర్ డానీ మెద్వెదెవ్‌ ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో నిక్‌ కైర్గోస్‌ (ఆసీస్‌)పై 7-6, 6-4, 4-6, 6-2 తేడాతో విజయం సాధించాడు. మరొక మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ ఆటగాడు సిట్సిపాస్‌ (గ్రీస్‌) 7-6, 6-7, 6-3, 6-4 తేడాతో బాయెజ్‌పై (అర్జెంటీనా) గెలుపొందాడు. ఇక 13వ సీడెడ్ ఆటగాడు స్కావర్జ్‌మన్‌ (అర్జెంటీనా) 6-7, 4-6, 4-6 తేడాతో క్రిస్టోఫర్‌ కార్నెల్‌ (ఆసీస్‌) చేతిలో ఓడిపోయాడు. ఏకపక్షంగా సాగిన మరొక మ్యాచ్‌లో రష్యన్‌ స్టార్‌ ఆండ్రే రుబ్లేవ్‌ (5వ సీడ్) 6-4, 6-2, 6-0 తేడాతో బెరాంకిస్‌పై (లూథియానా) ఘన విజయం సాధించాడు. మాజీ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు ఆండీ ముర్రే రెండో రౌండ్‌లో క్వాలిఫయిర్‌ టారో డానియల్‌ చేతిలో ఓడిపోయాడు. 120వ ర్యాంకర్‌ టారో 6-4, 6-4, 6-4 తేడాతో ముర్రేపై విజయం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని