Ayush Badoni: అరంగేట్రంలోనే అదరగొట్టి.. ఆయుష్‌ బదోని కొత్త రికార్డు

లఖ్‌నవూ జట్టు యువ ఆటగాడు ఆయుష్‌ బదోని మెగా టీ20 లీగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అతడు తొలి...

Updated : 29 Mar 2022 13:08 IST

(Photo: Ayush Badoni Instagram)

ముంబయి: లఖ్‌నవూ జట్టు యువ ఆటగాడు ఆయుష్‌ బదోని మెగా టీ20 లీగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అతడు తొలి గేమ్‌లోనే అంచనాలకు మించి రాణించాడు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును అర్ధ శతకంతో ఆదుకున్నాడు. యువ ఆటగాడిగా టీ20ల్లో ఏమాత్రం అనుభవం లేకపోయినా.. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేశాడు. రషీద్‌ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సులు బాదాడు. దీంతో ఈ టీ20 టోర్నీ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

కాగా, ఆయుష్‌ ఈ మ్యాచ్‌కు ముందు టీ20 క్రికెట్‌లో కేవలం 8 పరుగులే చేశాడు. అంతకుముందు పొట్టి ఫార్మాట్‌లో అతడికి ఏమాత్రం అనుభవం లేదు. కనీసం ఫస్ట్‌క్లాస్‌ లేదా లిస్ట్‌-ఏ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేకపోయింది. ఈ నేపథ్యంలోనే 41 బంతుల్లో.. 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. దీపక్‌ హుడా (55; 41 బంతుల్లో 6x4, 2x6)తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మిగిలుండగా ఔటయ్యాడు. ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. తమ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రోత్సాహం వల్లే రాణించానని చెప్పాడు. అతడు స్వేచ్ఛగా ఆడమని సలహా ఇచ్చాడన్నాడు. దీంతో తాను  సహజసిద్ధమైన బ్యాటింగ్‌ శైలిలో ఆడినట్లు పేర్కొన్నాడు. అలాగే బ్యాటింగ్‌ చేసేటప్పుడు స్కోర్‌ బోర్డు చూడలేదని, అర్ధ శతకం బాదిన సంగతి కూడా తర్వాతే తెలిసిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తొలి బౌండరీ కొట్టాక ఆత్మస్థైర్యం పెరిగిందని తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని