Pakistan-T20 WC 2024: ఘోర పరాభవం.. పాక్‌కు వెళ్లని బాబర్‌.. అతడితోపాటు మరో ఐదుగురు!

అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే ఆందోళనతో పాక్‌కు చెందిన కొందరు క్రికెటర్లు స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపినట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 18 Jun 2024 11:47 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఘోర పరాభవం ఎదుర్కొంది. లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. అయితే, చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించి కాస్త సాంత్వన పొందినప్పటికీ.. పాక్ అభిమానుల ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పడం లేదు. దీంతో చివరి లీగ్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌తోపాటు మరో ఐదుగురు క్రికెటర్లు స్వదేశానికి వెళ్లలేదని వార్తలు వస్తున్నాయి. వీరంతా యూఎస్‌ నుంచి నేరుగా యూకే వెళ్లినట్లు సమాచారం. కొన్ని రోజులు అక్కడే గడిపిన తర్వాత పాక్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో మహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్, ఆజం ఖాన్ లండన్‌ వెళ్తారని సమాచారం. వీరిలో కొందరు అక్కడి స్థానిక లీగుల్లో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. 

కెప్టెన్సీని వదిలేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన బాబర్‌.. పాక్‌కు వెళ్లాక పీసీబీతో చర్చిస్తానని చెప్పాడు. కానీ, ఇప్పుడు అతడు నేరుగా స్వదేశానికి వెళ్లకపోవడంపై ఆ జట్టు మాజీలు, క్రికెట్ అభిమానులు విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. వరల్డ్‌ కప్‌లో ఓటమిపై సమీక్షించాల్సిన అవసరం ఉందనేది కొందరి వాదన. అప్పుడే జట్టులోని లోటుపాట్లపై ఓ అవగాహనకు వచ్చినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కామెంట్లు వస్తున్నాయి.

ఇప్పటికీ బాబర్‌ బెస్ట్‌: సంజయ్ బంగర్

పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను నడిపించడంలో విఫలమైన కెప్టెన్ బాబర్ అజామ్‌పై ఓవైపు విమర్శలు వస్తుంటే.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ మాత్రం అతడికి మద్దతు తెలిపాడు. ‘‘పాకిస్థాన్‌ను నడిపించడానికి ఇప్పటికీ అత్యుత్తమ క్రికెటర్ బాబర్ అజామ్. డీఆర్‌ఎస్‌ను వినియోగించుకోవడంలో ఇంకాస్త మెరుగవ్వాలి. నిర్ణయం తీసుకొనేందుకు దృఢంగా ఉండాలి. ఇప్పటికిప్పుడు బాబర్‌కు ప్రత్యామ్నాయం లేడనే చెబుతా. షహీన్‌ను ప్రయత్నించినా సక్సెస్‌ కాలేదు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ మార్పు చేసినా పాక్‌ విఫలమైంది. సారథ్యం చేపట్టే సత్తా ఉన్న క్రికెటర్ కనిపించడం లేదు. బాబర్‌కు మరింత మద్దతుగా నిలిస్తే తప్పకుండా భవిష్యత్తులో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది’’ అని బంగర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు