Babar Azam: ఆ క్రికెటర్‌తోపాటు యూట్యూబర్లపై బాబర్‌ అజామ్‌ లీగల్‌ యాక్షన్‌!

తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యాడు. 

Published : 22 Jun 2024 11:58 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఘోర పరాభవానికి తానే కారణమంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై కెప్టెన్ బాబర్ అజామ్‌ (Pakistan Captain Babar Azam) చట్టపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. బాబర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. వెటరన్ క్రికెటర్ అహ్మద్ షహజాద్‌తోపాటు యూట్యూబుల్లో పలువురు మాజీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పీసీబీ (Pakistan Cricket Board) లీగల్ సెక్షన్ పరిశీలిస్తోంది. లీగ్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించినప్పటికీ కొందరు ఆటగాళ్లు ఇంకా యూఎస్‌ఏలోనే ఉండటంపై అహ్మద్‌ తీవ్ర విమర్శలు చేశాడు. వాటిని పరిశీలించి లీగల్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పీసీబీ కమిటీ చర్చించనుంది. 

వరల్డ్‌ కప్‌లో (ICC Mens T20 World Cup) తమ పోరాటం ముగిసిన తర్వాత.. కొందరు ఆటగాళ్లు పాక్‌కు చేరారు. ఇవాళ కెప్టెన్ బాబర్‌తోపాటు ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్, ఆజంఖాన్ స్వదేశానికి వెళ్తారని సమాచారం. కెప్టెన్సీ మార్పుపై ఇప్పటివరకు పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సెలక్షన్ కమిటీని ప్రక్షాళన చేస్తున్నట్లు ఇప్పటికే పీసీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడం లేదని.. పీసీబీ ఏం ఆదేశాలు జారీ చేస్తే వాటిని పాటించేందుకు సిద్ధమని బాబర్‌ స్పష్టంచేశాడు. 

పాక్‌ క్రికెట్‌ నవ్వులపాలైంది: వసీమ్‌ అక్రమ్

పొట్టి కప్‌ నుంచి నిష్క్రమించడంతో పాక్‌పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ మాజీ స్టార్‌ క్రికెటర్ వసీమ్‌ అక్రమ్ ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పాక్‌ క్రికెట్‌ నవ్వులపాలైందని వ్యాఖ్యానించాడు. ‘‘ఒకే ఒక్క ఏడాదిలో ముగ్గురు ఛైర్మన్లు మారారు. బాబర్‌ను తప్పించి.. షహీన్ అఫ్రిదిని (Shaheen Shah Afridi) కెప్టెన్‌గా చేశారు. మళ్లీ బాబర్‌ను తీసుకొచ్చారు. పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి రమీజ్‌ రజాను తప్పించి నజామ్‌ సేథీని తీసుకొచ్చారు. మళ్లీ జకా అష్రాఫ్‌ను నియమించారు. అతడినీ పక్కనపెట్టేసి మోసిన్ నక్వీని ఎంపిక చేశారు. ఇక జట్టులో నిలకడ ఎక్కడ వస్తుంది? ఛైర్మన్ మారినప్పుడల్లా కెప్టెన్ మార్పు జరిగింది. షహీన్‌ను చేసినప్పుడు కనీసం ఒక్క ఏడాదైనా అవకాశం ఇవ్వలేదు’’ అని వసీమ్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని