Babar Azam: టీమ్‌ఇండియాపై పాక్‌ ప్రధాని సెటైర్‌.. బాబర్‌ అజామ్‌ స్పందన ఇదే..

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో టీమ్‌ఇండియా సెమీస్‌ను ఘోర పరాభవంతో నిష్క్రమించడంపై పాక్‌ ప్రధాని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆయన చేసిన ‘‘152/0 vs 170/0’’ వైరల్‌గా మారింది.

Updated : 12 Nov 2022 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంచనాలను తలకిందులు చేస్తూ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది పాకిస్థాన్‌. మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌ సన్నద్ధతపై పాక్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమిని విమర్శిస్తూ పాక్‌ ప్రధాని చేసిన ట్వీట్‌ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బాబర్‌ స్పందించాడు. ఆ ట్వీట్‌ గురించి తాను మాట్లాడలేనని తెలిపాడు.

కీలక సెమీస్‌ పోరులో భారత జట్టు.. ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒక్క వికెట్‌ కోల్పోకుండా 169 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్‌ పూర్తి చేసింది. దీంతో ఆ మ్యాచ్ అనంతరం పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ట్విటర్ వేదికగా టీమ్‌ఇండియాపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘152/0 vs 170/0’’ అని ట్వీట్ చేశారు. 152/0 అంటే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై ఛేదనలో పాక్‌ చేసిన స్కోరు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌పై వికెట్‌ కోల్పోకుండా విజయాలు సాధించిన ఈ రెండు జట్లు ఈ సారి ఫైనల్‌లో తలపడుతున్నాయన్న అర్థంలో.. టీమ్‌ఇండియాను విమర్శిస్తూ పాక్‌ ప్రధాని ఈ ట్వీట్‌ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ట్వీట్ గురించి మీడియా సమావేశంలో విలేకరులు పాక్‌ కెప్టెన్‌ను ప్రశ్నించారు. దీనికి బాబర్‌ బదులిస్తూ.. ‘‘క్షమించాలి. నేను ఆ ట్వీట్‌ చూడలేదు. దానిపై నాకు అవగాహన లేదు కాబట్టి నేను మాట్లాడలేను. అయితే ప్రత్యర్థిపై అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు మేం 100శాతం ప్రయత్నిస్తాం’’ అని తెలిపాడు. ఇక.. 1992 వన్డే ప్రపంచకప్ టోర్నీకి.. ఇప్పటి టీ20 ప్రపంచకప్‌నకు కొన్ని పోలికలు ఉన్నాయని బాబర్‌ అన్నాడు. ‘‘ఈ ట్రోఫీని సాధించేందుకు 100 శాతం ప్రయత్నిస్తాం. మాకు ఆరంభం సరిగా లేకపోయినా.. జట్టు అద్భుతంగా పుంజుకొని రావడం ఆనందంగా ఉంది. మా వాళ్లు పులుల్లా పోరాడారు. తుది పోరులోనూ ఇలాగే ప్రయత్నించి కప్‌ను సాధిస్తాం’’ అని పాక్‌ సారథి పేర్కొన్నాడు. 1992 ప్రపంచకప్‌ టోర్నీని కూడా పాకిస్థాన్‌ జట్టు ఓటమితో ఆరంభించింది. ఆ టోర్నీలోనూ భారత్‌ చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఫైనల్‌కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని