Babar Azam: దేశ పార్లమెంట్లో పాక్‌ జట్టు పరువు పాయే..!

పాక్‌ క్రికెట్‌ జట్టుపై విమర్శల జడివాన ఆగడంలేదు. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌లో ఓ ఎంపీ జట్టును తీవ్రస్థాయిలో విమర్శించాడు.  

Published : 24 Jun 2024 00:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ఘోరవైఫల్యంపై పాక్‌లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు మాజీ క్రీడాకారులు బాబర్‌ సేనను తూర్పారపట్టగా.. ఇప్పుడు ఆ దేశ పార్లమెంట్‌లో కూడా విమర్శించారు. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. అవసరమైతే ఇతరులపైకి నెట్టేయాలని ఆ దేశ పార్లమెంటేరియన్‌ ఒకరు సభలోనే సూచించారు.

పాక్‌ పార్లమెంట్లో ఎంపీ అబ్దుల్‌ ఖాద్రీ పటేల్‌ మాట్లాడుతూ బాబర్‌ ఆటతీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పోలుస్తూ ఎద్దేవా చేశారు. ‘‘ఈ క్రికెట్‌ జట్టుకు ఏమైంది. ఇది అమెరికాతో ఓడిపోయింది.. భారత్‌ చేతిలో చిత్తైంది. బాబర్‌ తన సీనియర్‌ ఆటగాడి (ఇమ్రాన్‌ ఖాన్‌) నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నలుగురైదుగురు సీనియర్‌ ఆటగాళ్లను పోగు చేసి ఓ బహిరంగ సభ పెట్టాలి. కొన్ని కాగితాలను గాల్లో ఊపుతూ నాపై కుట్ర జరుగుతోందని ప్రకటించాలి. అక్కడ ఎవరూ అతడిని ఇక ప్రశ్నించరు. ఆ తర్వాత అ విషయమే ముగిసిపోతుంది’’ అని సలహా ఇచ్చారు. 

ఈ టోర్నీ ముగిసిన తర్వాత పాక్‌ ఆటగాళ్లపై స్పాట్‌-ఫిక్సింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని చేసే వారు తగిన ఆధారాలతో ముందుకు రావాలని ఇప్పటికే పీసీబీ కోరింది. అలాకాని పక్షంలో ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. 

ఇక ఎన్నికల ప్రచారంలో తనపై కుట్ర జరుగుతోందని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా సాక్ష్యాలంటూ కొన్ని కాగితాలను ఆయన ప్రజలకు చూపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని ఉదహరిస్తూ అబ్దుల్‌ ఖాద్రీ పటేల్‌ పాక్‌ జట్టు నాయకుడు బాబర్‌ అజమ్‌ను ఎద్దేవా చేశారు.

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఘోర పరాభవానికి తానే కారణమంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై కెప్టెన్ బాబర్ అజామ్‌ చట్టపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. బాబర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. వెటరన్ క్రికెటర్ అహ్మద్ షహజాద్‌తోపాటు యూట్యూబుల్లో పలువురు మాజీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పీసీబీ లీగల్ సెక్షన్ పరిశీలిస్తోంది. లీగ్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించినప్పటికీ కొందరు ఆటగాళ్లు ఇంకా యూఎస్‌ఏలోనే ఉండటంపై అహ్మద్‌ తీవ్ర విమర్శలు చేశాడు. వాటిని పరిశీలించి లీగల్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పీసీబీ కమిటీ చర్చించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని