Alyssa Healy: కయ్యాలమారి అలీసా హీలీ.. మన టీమ్‌పై మొదటి నుంచీ అక్కసే!

సెమీస్‌లో హర్మన్‌ ప్రీత్‌ రనౌట్‌పై ఆసీస్‌ క్రికెటర్‌ అలీసా హీలి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు తోటి క్రీడాకారిణిని గౌరవించడం నేర్చుకో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated : 27 Feb 2023 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటే.. గ్రౌండ్‌లోనే కాదు.. మైదానం బయటా తలపడాలి. ఇటు బ్యాట్‌ - బాల్‌కే కాదు, అటు నోటికి కూడా పని చెప్పాలి. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఆసీస్ ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. మైదానంలోకి అడుగు పెట్టాకా అంతే. ఓడిపోతామని తెలిస్తే కావాలనే ప్రత్యర్థి ఆటగాళ్లతో వివాదాలు పెట్టుకోవడం వారు అమలు చేసే ప్లాన్‌ - బి సూత్రం. ఈ విషయంలో పురుష ఆటగాళ్లే కాదు.. ఆసీస్‌ (australia) మహిళా క్రికెటర్లూ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) రనౌట్‌ గురించి తాజాగా ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలీసా హీలీ (Alyssa Healy) చేసిన కామెంట్లే అందుకు నిదర్శనం.

టీ20 మహిళా ప్రపంచకప్‌లో గెలుపొందిన అనంతరం హర్మన్‌ రనౌట్‌ గురించి హీలి మాట్లాడుతూ.. సెమీస్‌లో భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌కు ప్రయత్న లోపమే కారణమంది. కాస్త ప్రయత్నించి ఉంటే పరుగు సాధ్యమయ్యేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాల్లో ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఉంటే పెద్ద టోర్నీలు గెలవొచ్చని, ఆ పనిని మేం చక్కగా చేస్తున్నామని తెలిపింది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. ‘రనౌట్‌ విషయాన్ని దురదృష్టమంటూ హర్మన్‌ తనకు నచ్చినట్లుగా జీవితాంతం చెప్పుకోవచ్చు’ అంటూ అలీసా తన అక్కసు వెళ్లగక్కింది. అయితే ఆమె ఇలా నోరు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ఇలా మాట్లాడి భారత్‌ అభిమానుల నుంచి చీవాట్లు తిన్న విషయం తెలిసిందే.

కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలోనూ భారత జట్టు విదేశాల్లో పర్యటించింది. అలా 2021లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అయితే, భారత ఆటగాళ్లకు సరైన వసతులు కల్పించడంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా విఫలమైంది. దీనిపై మన ఆటగాళ్లు, బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేశాయి. బ్రిస్బేన్‌లో కేటాయించిన రూముల్లో సరైన సదుపాయాలు లేవని, చివరికి టాయిలెట్లు కూడా తామే కడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఫిర్యాదు చేశారు. అయితే, క్రికెట్‌ ఆస్ట్రేలియాను నిందించడాన్ని తట్టుకోలేకపోయిన హీలీ.. అప్పట్లో నోరు పారేసుకుంది. ‘ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మహిళా జట్లు ఇదే హోటల్‌లో క్వారంటైన్‌  పూర్తి చేసుకున్నాయని, మాకు లేని ఇబ్బంది మీకేంటి’ అనే అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేసింది. దానికి మన భారత అభిమానులను గట్టిగానే సమాధానం ఇచ్చారు. భారత ఆటగాళ్లు గడిచిన నాలుగైదు నెలలుగా క్వారంటైన్‌లో ఉన్నారని, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత క్రికెట్‌ ఆస్ట్రేలియాపై ఉందని పేర్కొన్నారు. ఒకవేళ బీసీసీఐ అదే పనిచేసి ఉంటే ఇలానే స్పందించే వారా అంటూ చురకలంటించారు. 

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో హర్మన్‌ప్రీత్‌ సేన 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలినా తహిలా మెక్‌గ్రాత్‌ను ఆసీస్‌ ఆడించింది. దీనిపై భారత అభిమానులు ఆసీస్‌నుద్దేశించి ‘చీటర్స్‌’ అంటూ విమర్శించారు. విమర్శలను సహించలేకపోయిన హీలీ.. భారత అభిమానులను ఉద్దేశించి.. ‘అసూయతోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నార’నే అర్థం వచ్చేలా ఓ పోస్ట్‌ పెట్టింది. కాసేపటికే ‘అర్థాల కోసం వెతక్కండి.. ఊరికే పెట్టా’నంటూ మరో ట్వీట్ చేసింది.

తాజా ఉదంతం విషయంలోనూ భారత అభిమానులు ఆమెకు గట్టిగానే చీవాట్లు పెట్టారు. తన కారణంగా జట్టు ఓడిపోయిందన్న బాధతో కుంగిపోతున్న తోటి క్రీడాకారిణిని ఉద్దేశించి ఇలా మాట్లాడడం తగదంటూ కామెంట్లు పెట్టారు. ‘ముందు ప్రత్యర్థి క్రికెటర్లను గౌరవించడం నేర్చుకో. రేపు నీకూ ఇలాంటి పరిస్థితి రావొచ్చు’ అని నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘అయినా మ్యాచ్‌లో నువ్వూ ఎన్నో క్యాచ్‌లు వదిలేశావ్‌. అదే మీ జట్టు ఓడిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఓ సారి ఊహించుకో! ఆరోగ్యం బాగలేకపోయినా మా హర్మన్‌ 50 పరుగులు చేసింది’ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. ఇంతకీ ఈ హీలీ ఎవరో కాదు.. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ సతీమణే. అన్నట్లు ఆసీస్‌ మాజీ వికెట్ కీపర్‌ ఇయాన్‌ హీలీకి అలీసా బంధువే. ఆయన కూడా మొన్నీమధ్య భారత్- ఆసీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా పిచ్‌ల గురించి వైరల్‌ కామెంట్స్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని