ప్రపంచ కప్‌ ఆటగాళ్లకు రూ.11 కోట్లు.. మహారాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది: చిరాగ్

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చిరాగ్‌ మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు.

Published : 08 Jul 2024 17:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహారాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చిరాగ్‌ శెట్టి (Chirag Shetty) విమర్శించాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన క్రీడాకారులను సత్కరించినట్లు, 2022లో థామస్‌ కప్‌ డబుల్స్‌లో విజయం సాధించినపుడు ప్రభుత్వం గౌరవించలేదని  మండిపడ్డాడు. రోహిత్‌ శర్మతో సహా నలుగురు మహారాష్ట్ర క్రికెటర్లకు లభించిన గౌరవం థామస్‌ కప్‌ గెలిచిన తనకు దక్కలేదన్నాడు.

 ‘‘క్రికెటర్లపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారులం అందరం టీ20 ప్రపంచకప్‌ను టీవీలో వీక్షించాం. దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా విజయం సాధించి ప్రపంచకప్‌ అందుకోవడంతో సంబరాలు చేసుకున్నాం. కానీ ప్రభుత్వం ఇతర క్రీడలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. థామస్‌ కప్‌ కూడా ప్రపంచకప్‌తో సమానమే. థామస్‌ కప్‌ గెలిచిన జట్టులో మహారాష్ట్రకు చెందిన క్రీడాకారుడిని నేనొక్కడినే. రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్రీడలను సమానంగా పరిగణించాలి’’ అని చిరాగ్‌ అన్నాడు. భారత ప్రపంచకప్‌ జట్టులో సభ్యులైన నలుగురు మహారాష్ట్ర ఆటగాళ్లను ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. రాష్ట్ర శాసనసభలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సూర్యకుమార్‌ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్‌ దూబెలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శిందే భారత జట్టుకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని