IND vs PAK: పాక్‌ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్‌ అక్మల్

భారత గడ్డపై క్రికెట్‌ ఆడిన రోజులను పాక్‌ ఆటగాడు ఉమర్‌ అక్మల్ (Umar Akmal) గుర్తు చేసుకున్నాడు. 

Published : 03 Feb 2023 02:23 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఉగ్ర కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్‌ అన్నిరకాలుగా అండదండలు అందిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం క్రీడలపై కూడా పడింది. భారత్‌,పాక్‌ మధ్య చాలా ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి. దీంతో భారత్‌, పాక్‌ మధ్య జరిగే మ్యాచ్‌ల సంఖ్య తగ్గిపోయి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే, మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు ఆపాయ్యంగా పలకరించుకుంటూ సోదరభావంతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో మినహా అభిమానులు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత గడ్డపై క్రికెట్‌ ఆడిన రోజులను పాక్‌ ఆటగాడు ఉమర్‌ అక్మల్ గుర్తు చేసుకున్నాడు. పాకిస్థాన్‌ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారని పేర్కొన్నాడు. 

‘భారత్‌, ఆసియాలో ఆడటం నాకెంతో ఇష్టం. నేనిప్పటివరకు పాకిస్థాన్‌లో పెద్ద సిరీస్‌  ఆడలేదు. ఇక్కడ రెండు టీ20ల్లో మాత్రమే ఆడాను. రెండింటిలోనూ సున్నాకే ఔటయ్యా. భారత్‌లో నేను ఆడినప్పడు నా సొంత దేశంలో ఆడినట్లు అనిపించేది. భారత్‌లో ప్రేక్షకులు రెండు జట్లను గౌరవిస్తారు. పాకిస్థాన్‌ ఆటగాళ్లపై భారత అభిమానులు ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉత్సాహపరుస్తారు’ అని ఉమర్‌ అక్మల్‌ అన్నాడు. ఉమర్‌ అక్మల్ పాక్‌ తరఫున ఇప్పటివరకు 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు. రెండు వేర్వేరు సందర్భాల్లో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక చట్టాన్ని అక్మల్‌ ఉల్లంఘించాడంటూ 2020 ఏప్రిల్‌లో మూడేళ్ల నిషేధాన్ని విధించారు. తన తప్పును క్షమించాలని, శిక్షను తగ్గించాలంటూ అతడు అప్పీల్ చేసుకోవడంతో సస్పెన్షన్‌ను మూడేళ్ల నుంచి ఏడాదిన్నరకు తగ్గించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని