Bajrang Punia: నా కాలు విరిగినా పర్లేదు.. పతకమే ముఖ్యం

ఓ జాతీయ పత్రికతో బజరంగ్‌ మాట్లాడుతూ.. ‘నా కాలికి ఉన్న పట్టీలు మ్యాట్‌పై నా కదలికలకు అడ్డంకిగా మారాయి. దీంతో రెండో రోజు పట్టీలు వేసుకోవద్దని నిర్ణయించుకున్నా. నేను ఇలా చేయడం మొదటిసారి....

Published : 15 Aug 2021 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన రెజ్లర్‌ బజరంగ్‌ పునియా దేశానికి గర్వకారణంగా నిలిచాడు. సెమీస్‌లో (65 కేజీల విభాగం) ఓటమిపాలైనప్పటికీ ప్లేఆఫ్‌లో అద్భుతంగా పుంజుకొని కజక్‌స్థాన్‌కు చెందిన దౌలత్‌ నియజ్‌బెకోవ్‌ను 8-0తో చిత్తు చేశాడు. గాయమైన కుడి కాలికి పట్టీలతోనే ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన బజరంగ్‌.. సెమీస్‌లో ఓటమి తర్వాత ఆ పట్టీలు లేకుండానే ప్లేఆఫ్‌లో తలబడ్డాడు. కాలు విరిగినా పర్లేదు కానీ పతకమే ముఖ్యమని భావించానని పేర్కొన్నాడు.

ఓ జాతీయ పత్రికతో బజరంగ్‌ మాట్లాడుతూ.. ‘నా కాలికి ఉన్న పట్టీలు మ్యాట్‌పై నా కదలికలకు అడ్డంకిగా మారాయి. దీంతో రెండో రోజు పట్టీలు వేసుకోవద్దని నిర్ణయించుకున్నా. నేను ఇలా చేయడం మొదటిసారి. పట్టీలు వేసుకోవాలని వైద్యులు సూచించారు. కానీ ఏం పర్లేదు. మహా అయితే ఏమవుతుంది.. నా కాలు విరిగి శస్త్రచికిత్స జరుగుతుంది. ఫ్రాక్చర్‌ అయినా, శస్త్రచికిత్స జరిగినా.. పతకమే ముఖ్యం. ఇంత కష్టపడ్డందుకే పతకం సాధించాననే సంతృప్తి ఉంటుంది’ అని వెల్లడించాడు.

రష్యాలో ఓ టోర్నీలో పోటీపడిన బజరంగ్‌ జూన్‌ 25న గాయపడ్డాడు. స్థానిక రెజ్లర్‌ అబుల్‌ మజీద్‌ కుదీవ్‌తో పోరులో అతడి మోకాలికి గాయమైంది. దాంతో మూడు వారాలపాటు ఆటకు దూరమయ్యాడు. ఈ గాయం కారణంగా భయపడ్డానని, కానీ ఒత్తిడికి గురికాలేదని బజరంగ్‌ తెలిపాడు. ‘చాలా మంది భారత క్రీడాకారుల ఒత్తిడి వల్లే ఒలింపిక్స్‌లో సరైన ప్రదర్శన చేయలేదు. అందుకే నేను ఒత్తిడికి గురికాకుండా ఉన్నా. అప్పట్లో ఒకానొక సందర్భంలో నేనూ ఒత్తిడికి గురయ్యా. అప్పుడు నేనేం చేశానో నాకే తెలియదు.  ఇకపై ఒత్తిడిని దరిచేరనివ్వకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని