Bajrang Punia: బజరంగ్‌ పునియాపై మరోసారి వేటు.. ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై సందేహాలు!

Bajrang Punia: డోపింగ్‌ పరీక్ష కోసం నమూనాలు ఇవ్వని కారణంగా బజరంగ్‌ పునియాపై నాడా మరోసారి సస్పెన్షన్‌ వేటు వేసింది.

Updated : 23 Jun 2024 14:19 IST

దిల్లీ: రెజ్లింగ్‌లో ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్‌ పునియా (Bajrang Punia)పై మరోసారి సస్పెన్షన్‌ వేటు పడింది. డోపింగ్‌ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వని కారణంగా ఆయన్ను ‘నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA)’ తాజాగా సస్పెండ్‌ చేసింది. నెల క్రితమే ఆయనపై తొలిసారి వేటువేయగా.. ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా దాన్ని క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. అనంతరం నోటీసులు ఇచ్చిన నాడా తాజాగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో త్వరలో జరగబోయే ఒలింపిక్స్ పోటీల్లో ఆయన పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకొన్నాయి.

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా నాడా డోపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకోసం మార్చి 10న బజరంగ్‌ పునియా (Bajrang Punia) నుంచి మూత్ర నమూనాలను కోరింది. కానీ, ఆయన మాత్రం ఆ శాంపిల్‌ను అందించలేదని తెలిపింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ సస్పెన్షన్‌ వేటు వేసింది. జులై 11లోగా స్పందించాలని ఆదేశించింది.

బౌండరీలు బాదుతున్నా.. ఆ సూత్రానికే కట్టుబడి ఉంటా: కుల్‌దీప్‌

నాడా కాలంచెల్లిన డోపింగ్‌ పరీక్ష కిట్లను ఉపయోగిస్తోందని పునియా (Bajrang Punia) గతంలో ఆరోపించారు. దీనిపై ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. వివరణ రానందునే తాను నమూనాలు ఇవ్వలేదని తెలిపారు. మరోవైపు నమూనాలు ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినప్పటికీ.. పునియా అలాగే వెళ్లిపోయారని నాడా అధికారులు ఆరోపించారు.

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ప్రముఖ రెజ్లర్లు.. ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో గతంలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బజరంగ్‌ పునియాతో పాటు రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగట్‌లు చేసిన పోరాటం ఫలితంగా బ్రిజ్‌ భూషణ్‌పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని