Updated : 05 May 2022 03:43 IST

Bangalore vs Chennai: బెంగళూరు గెలుపు బాట

హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత ఓ విజయం

మెరిసిన లొమ్రార్‌, హర్షల్‌, మ్యాక్స్‌వెల్‌

అలీ శ్రమ వృథా.. చెన్నైకి ఏడో పరాజయం

ప్లేఆఫ్‌ రేసులో దూసుకెళ్తూ, ఉన్నట్లుండి గాడి తప్పి హ్యాట్రిక్‌ ఓటములు చవిచూసిన జట్టు బెంగళూరు. ఇంకో మ్యాచ్‌ ఓడితే రేసులో మరింత వెనుకబడే స్థితిలో ఆ జట్టు అత్యావశ్యక విజయాన్నందుకుంది. ఈ సీజన్లో తడబడుతూ సాగుతున్న చెన్నైని బెంగళూరు ఓడించింది. ప్లేఆఫ్‌ రేసులో ఉండాలంటే దాదాపుగా ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన స్థితిలో చెన్నై ఇంకో ఓటమి ఖాతాలో వేసుకుంది. ఆ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలు ఇక నామమాత్రమే కావచ్చు.

పుణె

ఈ సీజన్‌లో బెంగళూరు ఓటమి బాట వీడింది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 13 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది. మొదట మహిపాల్‌ లొమ్రార్‌ (42; 27 బంతుల్లో 3×4, 2×6), డుప్లెసిస్‌ (38; 22 బంతుల్లో 4×4, 1×6) మెరవడంతో బెంగళూరు 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో తీక్షణ (3/27), మొయిన్‌ అలీ (2/28) సత్తా చాటారు. అనంతరం చెన్నై 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. కాన్వే (56; 37 బంతుల్లో 6×4, 2×6), మొయిన్‌ అలీ (34; 27 బంతుల్లో 2×4, 2×6)ల పోరాటం సరిపోలేదు. హర్షల్‌ పటేల్‌ (3/35), మ్యాక్స్‌వెల్‌ (2/22) ఆ జట్టును దెబ్బ తీశారు. 11 మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది ఆరో విజయం కాగా.. 10 మ్యాచ్‌ల్లో చెన్నై ఏడో ఓటమి చవిచూసింది.

బాగానే ఆరంభించినా..: ఛేదనలో చెన్నై అదిరే ఆరంభం లభించింది. గత మ్యాచ్‌ హీరోలు రుతురాజ్‌, కాన్వే జోరు కొనసాగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా చెన్నై 51 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని సులువుగానే ఛేదించేస్తుందనిపించింది. కానీ పవర్‌ప్లే అవ్వగానే చెన్నై తడబాటు మొదలైంది. ముందుగా రుతురాజ్‌ (28; 23 బంతుల్లో 3×4, 1×6).. షాబాజ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. తర్వాత మ్యాక్స్‌వెల్‌ వరుస ఓవర్లలో ఉతప్ప (1), రాయుడు (10)లను ఔట్‌ చేసి చెన్నైని గట్టి దెబ్బ తీశాడు. అయితే ఓ ఎండ్‌లో కాన్వే ధాటిగా ఆడుతుండటం, అతడికి మొయిన్‌ అలీ తోడవడంతో చెన్నై పుంజుకుంది. 14 ఓవర్లకు స్కోరు 109/3. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువున్నా.. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌ ఉండటం, వెనుక జడేజా, ధోని ఉండడంతో చెన్నై రేసులో ఉన్నట్లే కనిపించింది. కానీ తర్వాత హర్షల్‌ పటేల్‌ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు లక్ష్యానికి దూరమైంది. 18వ ఓవర్లో మొయిన్‌ అలీ ఔటవడంతో చెన్నై పనైపోయింది. తర్వాత ఆ జట్టు ఓటమి లాంఛనమే.

రాణించిన లొమ్రార్‌, డుప్లెసిస్‌: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరుకు దక్కిన ఆరంభం చూస్తే.. ఆ జట్టు 200 చేస్తుందేమో అనిపించింది. మధ్యలో ఆ జట్టు తడబాటు చూస్తే 160 కూడా కష్టంలా కనిపించింది. కానీ చివరికి మరీ భారీ స్కోరు కాకుండా, తక్కువా చేయకుండా 173/8తో ఇన్నింగ్స్‌ను ముగించింది. గత కొన్ని మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన కెప్టెన్‌ డుప్లెసిస్‌.. ఊపందుకోవడంతో బెంగళూరుకు మెరుపు ఆరంభం లభించింది. గత మ్యాచ్‌లో అర్ధశతకంతో లయ అందుకున్న కోహ్లి (30; 33 బంతుల్లో 3×4, 1×6) కూడా నిలకడగా ఆడడంతో పవర్‌ప్లే ముగిసేసరికి 57/0తో బెంగళూరు పటిష్ఠ స్థితిలో నిలిచింది. హైదరాబాద్‌పై 4 వికెట్లతో అదరగొట్టిన ముకేశ్‌ బెంగళూరు ఓపెనర్ల జోరు ముందు నిలవలేకపోయాడు. 3 ఓవర్లలో వికెట్‌ లేకుండా 30 పరుగులిచ్చాడు. మరో పేసర్‌ సిమ్రాన్‌జీత్‌ కూడా (2 ఓవర్లలో 0/21) తేలిపోయాడు. అయితే స్పిన్నర్ల రంగప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ ఓ ఎండ్‌లో ఒత్తిడి పెంచగా.. మరో ఎండ్‌లో మొయిన్‌ అలీ డుప్లెసిస్‌, కోహ్లిల వికెట్లు తీశాడు. డుప్లెసిస్‌ భారీ షాట్‌ ఆడబోయి క్యాచ్‌ ఔట్‌ కాగా.. కోహ్లి బంతిని తప్పుగా అంచనా వేసి బౌల్డయ్యాడు. మధ్యలో మ్యాక్స్‌వెల్‌ (3) రనౌటవడంతో 10 ఓవర్లకు 79/3తో నిలిచింది. స్కోరింగ్‌ రేట్‌ బాగున్నా.. కీలక వికెట్లు పడటంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించింది. అయితే పెద్దగా అంచనాల్లేని లొమ్రార్‌.. రజత్‌ పటిదార్‌ (21) అండతో చెలరేగాడు. ఇద్దరూ సమయోచితంగా షాట్లు ఆడి స్కోరు వేగం పడిపోకుండా చూశారు. రజత్‌ ఔటయ్యాక కూడా లొమ్రార్‌ దూకుడు కొనసాగించడంతో 18 ఓవర్లకు బెంగళూరు 155/4కు చేరుకుంది. లొమ్రార్‌, కార్తీక్‌ క్రీజులో ఉండడంతో స్కోరు 185-190 మధ్య అయ్యేలా కనిపించింది. కానీ తీక్షణ 19వ ఓవర్లలో 2 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి ఓవర్లో కార్తీక్‌ (26 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 3×6) రెండు సిక్సర్లు బాది స్కోరును 170 దాటించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని