Hasaranga : ఉమ్రాన్‌ బౌలింగ్‌పై ఎటాక్‌.. బెంగళూరు ప్రణాళికలేంటో చెప్పిన హసరంగ

 ప్రస్తుత టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గత రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపడంలేదు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ...

Published : 10 May 2022 02:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గత రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన ఉమ్రాన్‌ వికెట్‌ తీయకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఉమ్రాన్‌ను ఎదుర్కోవడంపై తమ జట్టు ప్రణాళికలను బెంగళూరు ఆల్‌రౌండర్‌ హసరంగ వెల్లడించాడు. ‘‘ఉమ్రాన్‌ చాలా వేగంగా బంతులను సంధిస్తాడు. అయితే సరైన లెంగ్త్‌లో పడితే ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ, ఈ వికెట్‌ మీద బౌన్స్‌ లేకపోవడంతో మా బ్యాటర్లు చక్కని షాట్లు కొట్టగలిగారు. ఉమ్రాన్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 20 పరుగులు రాబట్టారు. దీంతో అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఉమ్రాన్‌ను ఎటాక్ చేస్తే అతడితోపాటు మిగతా బౌలర్లూ ఒత్తిడికి గురవుతారనేదే మా బ్యాటర్లు ప్రణాళిక. దానిని మైదానంలో అమలు చేయగలిగాం’’ అని వివరించాడు.

ఈ మ్యాచ్‌లో హసరంగ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. హసరంగ నాలుగు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ‘‘ప్రస్తుతం జట్టులో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా నేను వికెట్‌ తీయడానికే ప్రయత్నిస్తా. మరీ ముఖ్యంగా మిడిల్‌ ఓవర్లలోనూ.. కీలకమైన సమయాల్లో వికెట్లు తీస్తే జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యర్థిని ఒత్తిడికి నెట్టే అవకాశం ఉంటుంది’’ అని హసరంగ పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 125 పరుగులకే కుప్పకూలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని