T20 World Cup: సూపర్‌-8కు బంగ్లా

బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8కు చేరుకుంది. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌ విసిరిన సవాల్‌ను కాచుకున్న బంగ్లా.. 21 పరుగుల తేడాతో విజయం సాధించి ముందంజ వేసింది.

Published : 18 Jun 2024 04:33 IST

నేపాల్‌పై విజయం
కింగ్స్‌టౌన్‌ (సెయింట్‌ విన్సెంట్‌)

బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8కు చేరుకుంది. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌ విసిరిన సవాల్‌ను కాచుకున్న బంగ్లా.. 21 పరుగుల తేడాతో విజయం సాధించి ముందంజ వేసింది. బంగ్లాను 106 పరుగులకే పరిమితం చేయడమే కాక, ఓ దశలో సులువుగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించిన నేపాల్‌.. చివరి ఓవర్లలో ఒత్తిడికి గురై ప్రత్యర్థికి మ్యాచ్‌ను అప్పగించింది. బంగ్లా ముందంజ వేయడంతో సూపర్‌-8 లైనప్‌ ఖరారైంది.

పేసర్‌ తంజిమ్‌ హసన్‌ (4/7) కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ 8కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూపు-డి చివరి లీగ్‌ మ్యాచ్‌లో  బంగ్లా 21 పరుగుల తేడాతో నేపాల్‌పై విజయం సాధించింది. నేపాల్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. అనంతరం నేపాల్‌ 19.2 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గి 6 పాయింట్లు కైవసం చేసుకున్న బంగ్లా.. గ్రూపులో రెండో స్థానంలో నిలిచింది. గ్రూపులో అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) ఇప్పటికే సూపర్‌ 8కు చేరుకుంది.

బౌలింగ్‌లో సత్తా చాటినా..: టాస్‌ గెలిచి బంగ్లాకు బ్యాటింగ్‌ అప్పగించిన నేపాల్‌.. బౌలింగ్‌లో సత్తాచాటింది. బౌలర్లంతా సమష్టిగా రాణించడంతో బంగ్లా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ (0)ను ఔట్‌ చేసిన పేసర్‌ సోంపాల్‌ కామి (2/10).. తర్వాతి ఓవర్లో కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో (4)ను వెనక్కి పంపాడు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా కోలుకోలేకపోయింది. దీపేంద్రసింగ్‌ (2/22), రోహిత్‌ పౌడెల్‌ (2/20), సందీప్‌ లమిచానె (2/17) సమష్టిగా విజృంభించడంతో బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. టెయిలెండర్లు రిషాద్‌ హొస్సేన్‌ (13), తస్కిన్‌ అహ్మద్‌ (12 నాటౌట్‌) బంగ్లా స్కోరును 100 దాటించారు. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నేపాల్‌ పరిస్థితి మరీ దారుణం. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తంజిమ్, ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (3/7) చెరో వైపు నిప్పులు చెరగడంతో నేపాల్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. 4 ఓవర్లు వేసిన తంజిమ్‌.. రెండు మెయిడిన్‌లు సహా 21 బంతుల్ని డాట్‌ బాల్స్‌గా వేయడం గమనార్హం. తంజిమ్, ముస్తాఫిజుర్‌ ధాటికి నేపాల్‌ 26 పరుగులకే 5 వికెట్లు (7 ఓవర్లలో) కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఈ సమయంలో కుశాల్‌ మల్లా (27; 40 బంతుల్లో 1×4, 1×6), దీపేంద్రసింగ్‌ (25; 31 బంతుల్లో 2×4, 1×6) జట్టును ఆదుకున్నారు. ఒక్కో పరుగు జోడిస్తూ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించి నేపాల్‌ను గెలుపు దిశగా నడిపించారు. చేతిలో 5 వికెట్లుండగా.. 21 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన సమయంలో నేపాల్‌ గెలుస్తుందనే అనిపించింది. అయితే ముస్తాఫిజుర్, షకిబ్‌ అల్‌హసన్‌ (2/9) ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పారు. కుశాల్, దీపేంద్రను ముస్తాఫిజుర్‌ ఔట్‌ చేయగా.. సోంపాల్‌ (0), అబినాష్‌ (0)ను షకిబ్‌ వెనక్కి పంపాడు. కేవలం ఏడు పరుగుల తేడాలో చివరి అయిదు వికెట్లు కోల్పోయిన నేపాల్‌ చేజేతులా పరాజయాన్ని మూటగట్టుకుంది.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ (సి) అండ్‌ (బి) సోంపాల్‌ 0; లిటన్‌ దాస్‌ (సి) ఆసిఫ్‌ (బి) సోంపాల్‌ 10; నజ్ముల్‌ (బి) దీపేంద్ర 4; షకిబ్‌ (ఎల్బీ) (బి) రోహిత్‌ 17; హృదోయ్‌ (సి) లమిచానె (బి) రోహిత్‌ 9; మహ్మదుల్లా రనౌట్‌ 13; జేకర్‌ (బి) లామిచానె 12; తంజిమ్‌ (బి) లమిచానె 3; రిషాద్‌ (సి) అనిల్‌ (బి) దీపేంద్ర 13; తస్కిన్‌ నాటౌట్‌ 12; ముస్తాఫిజుర్‌ రనౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 10;
మొత్తం: (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 106;
వికెట్ల పతనం: 1-0, 2-7, 3-21, 4-30, 5-52, 6-61, 7-69, 8-75, 9-88;
బౌలింగ్‌: సోంపాల్‌ కామి 3-0-10-2; దీపేంద్రసింగ్‌ 3.3-0-22-2; రోహిత్‌ 4-0-20-2; సందీప్‌ లమిచానె 4-1-17-2; కుశాల్‌ 4-0-22-0; అబినాష్‌ 1-0-10-0

నేపాల్‌ ఇన్నింగ్స్‌: కుశాల్‌ (బి) తంజిమ్‌ 4; ఆసిఫ్‌ (సి) షకిబ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 17; అనిల్‌ (సి) నజ్ముల్‌ (బి) తంజిమ్‌ 0; రోహిత్‌ (సి) రిషాద్‌ (బి) తంజిమ్‌ 1; సందీప్‌ (సి) రిషాద్‌ (బి) తంజిమ్‌ 1; మల్లా (సి) నజ్ముల్‌ (బి) ముస్తాఫిజుర్‌ 27; దీపేంద్ర (సి) లిటన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 25; గుల్షన్‌ (సి) హృదోయ్‌ (బి) తస్కిన్‌ 0; సోంపాల్‌ (స్టంప్డ్‌) లిటన్‌ (బి) షకిబ్‌ 0; లమిచానె నాటౌట్‌ 0; అబినాష్‌ ఎల్బీ (బి) షకిబ్‌ 0; ఎక్స్‌ట్రాలు 10;
మొత్తం: (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 85;
వికెట్ల పతనం: 1-9, 2-9, 3-20, 4-24, 5-26, 6-78, 7-85, 8-85, 9-85;
బౌలింగ్‌: తంజిమ్‌ 4-2-7-4; తస్కిన్‌ 4-0-29-1; ముస్తాఫిజుర్‌ 4-1-7-3; రిషాద్‌ 3-0-15-0; షకిబ్‌ 2.2-0-9-2; మహ్మదుల్లా 2-0-15-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని