T20 World Cup 2024: నేపాల్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. సూపర్-8కి అర్హత

తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచ కప్‌ సూపర్-8కి అర్హత సాధించింది. 

Published : 17 Jun 2024 10:02 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) లీగ్‌ స్టేజ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలిఉన్నాయి. తాజాగా నేపాల్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించి గ్రూప్-D నుంచి రెండో జట్టుగా సూపర్-8కి అర్హత సాధించింది. దీంతో నెదర్లాండ్స్‌ ఆశలకు గండి పడింది. ఆ జట్టు ఆడిన చివరి మ్యాచ్‌ నామమాత్రంగా మిగిలింది. దీంతో సూపర్‌ -8కి చేరిన జట్లేవో తేలిపోయాయి.  

బౌలింగ్‌లో అదరగొట్టిన తన్జిమ్‌

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. షకిబ్ (17) టాప్‌ స్కోరర్ కావడం గమనార్హం. నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో బంగ్లా దూకుడుగా ఆడలేకపోయింది. లామిచానె, సోంపాల్, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్ తలో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ కూడా తీవ్రంగా ఇబ్బంది పడింది. టాప్‌ ఆర్డర్‌లో ఆసిఫ్ (17) మినహా ఎవరూ రాణించలేదు. అయితే, మిడిలార్డర్‌లో కుశాల్ (27), దీపేంద్ర సింగ్ (25) కీలక భాగస్వామ్యం నిర్మించి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించారు. అయితే, వారిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో నేపాల్‌ వెనకబడిపోయింది. చివరికి 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. ఇదే స్కోరు మీద నేపాల్‌ నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. బంగ్లా బౌలర్ తన్జిమ్‌ (4/7) దెబ్బకు నేపాల్ కుదేలైంది. ముస్తాఫిజర్‌ (3/7), షకిబ్ (2/9) మంచి సహకారం అందించారు. 

నామమాత్రపు మ్యాచుల్లో శ్రీలంక, పాక్‌ విజయం

సూపర్-8కి అర్హత సాధించే అవకాశం లేని శ్రీలంక, పాకిస్థాన్‌ తమ చివరి లీగ్‌ మ్యాచుల్లో విజయం సాధించాయి. నెదర్లాండ్స్‌పై శ్రీలంక 83 పరుగుల తేడాతో గెలువగా.. ఐర్లాండ్‌పై పాకిస్థాన్‌ అతికష్టంగా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఇంటిముఖం పట్టాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు న్యూజిలాండ్ - పాపువా న్యూగినీ మ్యాచ్‌ జరగనుంది. ఇది కూడా నామమాత్రమే. మంగళవారం ఉదయం 6 గంటలకు వెస్టిండీస్-అఫ్గానిస్థాన్‌ చివరి పోరుతో లీగ్‌ స్టేజ్‌ ముగుస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు