T20 World Cup: షకిబ్‌ ధనాధన్‌

టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు కీలక విజయం. గురువారం గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. షకిబ్‌ అల్‌ హసన్‌ (64 నాటౌట్‌; 46 బంతుల్లో 9×4) మెరవడంతో మొదట బంగ్లాదేశ్‌ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది.

Published : 14 Jun 2024 03:49 IST

నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్‌ విజయం
కింగ్స్‌టౌన్‌

టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు కీలక విజయం. గురువారం గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. షకిబ్‌ అల్‌ హసన్‌ (64 నాటౌట్‌; 46 బంతుల్లో 9×4) మెరవడంతో మొదట బంగ్లాదేశ్‌ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. తంజిద్‌ హసన్‌ (35; 26 బంతుల్లో 5×4, 1×6) రాణించాడు. ఛేదనలో నెదర్లాండ్స్‌ 8 వికెట్లకు 134 పరుగులే చేయగలిగింది. సిబ్రాండ్‌ (33) టాప్‌ స్కోరర్‌. డచ్‌ జట్టు ఓ దశలో 14.3 ఓవర్లలో 111/3తో గట్టిగా పోటీలో నిలిచింది. కానీ సిబ్రాండ్‌ను రిషాద్‌ (3/33) ఔట్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. చకచకా వికెట్లు పడగొట్టిన బంగ్లా.. మ్యాచ్‌పై పట్టుబిగించింది. నెదర్లాండ్స్‌కు పుంజుకునే అవకాశమివ్వలేదు. మూడు మ్యాచ్‌ల్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న బంగ్లా సూపర్‌-8 అవకాశాలను బాగా మెరుగుపర్చుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో షకిబ్‌ ఆటే హైలౌట్‌. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన అతడు.. బంగ్లా పోటీ ఇవ్వదగ్గ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా.. 23 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఆ దశలో తంజిద్‌కు తోడైన షకిబ్‌.. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వాన్‌ బీక్‌ ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టాడు. మరోవైపు తంజిద్‌ కూడా బ్యాట్‌ ఝళిపించడంతో బంగ్లా ఏడు ఓవర్లలో 66/2తో నిలిచింది. అయితే నెదర్లాండ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో క్రమంగా పరుగుల వేగం బాగా తగ్గింది. 8 నుంచి 15 ఓవర్ల మధ్య 39 పరుగులే చేసిన బంగ్లా.. తంజిద్, హృదోయ్‌ (9) వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్లలో షకిబ్‌ కూడా ఎక్కువగా సింగిల్సే తీశాడు. అయితే షకిబ్, మహ్మదుల్లా చెలరేగడంతో ఆఖరి అయిదు ఓవర్లలో బంగ్లా 54 పరుగులు రాబట్టింది. మహ్మదుల్లా (25; 21 బంతుల్లో 2×4, 2×6)తో అయిదో వికెట్‌కు 41 పరుగులు జోడించిన షకిబ్‌.. జేకర్‌ అలీ (14 నాటౌట్‌)తో అభేద్యమైన ఆరో వికెట్‌కు 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతకుముందు తంజిద్‌తో మూడో వికెట్‌కు అతడు 48 పరుగులు జోడించాడు.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ (సి) డిలీడ్‌ (బి) మీకెరన్‌ 35; నజ్ముల్‌ శాంటో (సి) విక్రమ్‌జీత్‌ సింగ్‌ (బి) ఆర్యన్‌ దత్‌ 1; లిటన్‌ దాస్‌ (సి) సిబ్రాండ్‌ (బి) ఆర్యన్‌ దత్‌ 1; షకిబ్‌ నాటౌట్‌ 64; హృదోయ్‌ (బి) ప్రింగిల్‌ 9; మహ్మదుల్లా (సి) సిబ్రాండ్‌ (బి) మీకెరన్‌ 25; జేకర్‌ అలీ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-3, 2-23, 3-71, 4-89, 5-130; బౌలింగ్‌: వివియన్‌ కింగ్మా 2-0-20-0; ఆర్యన్‌ దత్‌ 4-0-17-2; మీకెరన్‌ 4-0-15-2; లొగాన్‌ వాన్‌ బీక్‌ 4-0-43-0; డిలీడ్‌ 3-0-31-0; ప్రింగిల్‌ 3-0-26-1

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: లెవిట్‌ (సి) హృదోయ్‌ (బి) తస్కిన్‌ 18; ఒడౌడ్‌ (సి) అండ్‌ (బి) తంజిమ్‌ 12; విక్రమ్‌జీత్‌ (స్టంప్డ్‌) లిటన్‌దాస్‌ (బి) మహ్మదుల్లా 26; సిబ్రాండ్‌ (సి) తంజిమ్‌ (బి) రిషాద్‌ 33; ఎడ్వర్డ్స్‌ (సి) జేకర్‌ (బి) ముస్తాఫిజుర్‌ 25; బాస్‌ డిలీడ్‌ (స్టంప్డ్‌) లిటన్‌దాస్‌ (బి) రిషాద్‌ 0; వాన్‌బీక్‌ (సి) అండ్‌ (బి) రిషాద్‌ 2; ప్రింగిల్‌ (బి) తస్కిన్‌ 1; ఆర్యన్‌దత్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 134; వికెట్ల పతనం: 1-22, 2-32, 3-69, 4-111, 5-111, 6-117, 7-117, 8-134; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 4-0-12-1; తంజిమ్‌ హసన్‌ 3-0-23-1; తస్కిన్‌ అహ్మద్‌ 4-0-30-2; షకిబ్‌ 4-0-29-0; రిషాద్‌ 4-0-33-3; మహ్మదుల్లా 1-0-6-1


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని