T20 Cricket: అయ్యో.. సెంచరీలు మిస్సయ్యారే..!

వేసవిలో క్రికెట్‌ ప్రేమికులకు పసందైన వినోదం అందిస్తోంది భారత టీ20 లీగ్‌. ముఖ్యంగా పలువురు బ్యాట్స్‌మెన్‌ పరుగుల పంట పండిస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ గురించి...

Published : 21 Apr 2022 01:57 IST

త్రుటిలో శతకాలు కోల్పోయిన ఆటగాళ్లు ఎవరంటే?

వేసవిలో క్రికెట్‌ ప్రేమికులకు పసందైన వినోదం అందిస్తోంది భారత టీ20 లీగ్‌. ముఖ్యంగా పలువురు బ్యాట్స్‌మెన్‌ పరుగుల పంట పండిస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ గురించి. అతడు ఇప్పటికే రెండు శతకాలతో దూసుకుపోతుండగా లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక సెంచరీతో మెరిశాడు. అయితే, పలువురు బ్యాట్స్‌మెన్‌ కూడా ఈపాటికే శతకాలు సాధించే అవకాశాలు వచ్చినా త్రుటిలో వాటిని చేజార్చుకున్నారు. వారెవరు.. ఎన్నెన్ని పరుగులు చేశారో పూర్తి వివరాలు తెలుసుకుందాం..


(Photo: Shubhman Gill Instagram)

గుజరాత్‌ గిల్‌: గతేడాది వరకు కోల్‌కతాలో కీలక ఆటగాడిగా ఉండి ఈసారి కొత్త జట్టు గుజరాత్‌కు ఆడుతున్నాడు శుభ్‌మన్‌గిల్‌. అతడు ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 33.33 సగటుతో 200 పరుగులు చేశాడు. అయితే, పంజాబ్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో గిల్‌ (96; 59 బంతుల్లో 11x4, 1x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసినా త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. 190 పరుగుల భారీ ఛేదనలో అతడి పోరాటమే కీలకంగా మారింది. సాయి సుదర్శన్‌ (35), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (35) అతడికి తోడవ్వడంతో గుజరాత్‌ మ్యాచ్‌ గెలిచింది. కానీ, 18.5 ఓవర్‌కు రాబాడా బౌలింగ్‌లో గిల్‌ ఔటవ్వడమే సెంచరీని కోల్పోయేలా చేసింది. అప్పటికి ఇంకా ఆ ఇన్నింగ్స్‌లో 7 బంతులు మిగులున్నా తొందరపడి ఔటయ్యాడు.


(Photo: Faf duplessis Instagram)

బెంగళూరు డుప్లెసిస్‌: గతేడాది చెన్నై ఓపెనర్‌గా విజృంభించి ఆడినట్టే ఈసారి కూడాబెంగళూరు కెప్టెన్‌గా దంచికొడుతున్నాడు ఫా డుప్లెసిస్‌. అతడు తాజాగా లఖ్‌న్‌వూతో ఆడిన మ్యాచ్‌లో గిల్‌లాగే నాలుగు పరుగుల దూరంలోనే శతకం కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడిన వేళ డుప్లెసిస్‌ (96; 64 బంతుల్లో 11x4, 2x6) ఒంటి చేత్తో రాణించాడు. లఖ్‌నవూ బౌలర్లపై విరుచుకుపడి ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే 19.5 ఓవర్‌కు భారీ షాట్‌ సెంచరీ పూర్తిచేద్దామని ప్రయత్నించి హోల్డర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. ఇక బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాహుల్‌ టీమ్‌ 163/8 స్కోర్‌కే పరిమితమైంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్‌ 35.71 సగటుతో 250 పరుగులు చేశాడు.


(Photo: Shivam Dube Instagram)

చెన్నై శివమ్‌: ఈ సీజన్‌కు ముందు వరకూ పెద్దగా ఆకట్టుకోలేని ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే. ఇంతకుముందు బెంగళూరు, రాజస్థాన్‌ జట్ల తరఫునా ఆడినా ఒక్క మ్యాచ్‌లోనే క్లిక్కయ్యాడు. అయితే, ఈసారి చెన్నై జట్టులో విశేషంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 45.20 సగటుతో 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో చెన్నై 216/4 భారీ స్కోర్‌ చేయగా.. దూబే (95 నాటౌట్‌; 46 బంతుల్లో 5x4, 8x6) సిక్సర్ల వర్షం కురిపించాడు. 19వ ఓవర్‌ పూర్తయ్యేసరికి 80 పరుగులతో నిలిచిన అతడు చివరి ఓవర్‌లో రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. అయితే, చివరి బంతికి 94 పరుగులతో ఉండగా భారీ షాట్‌ ఆడేందుకు చూసినా అది కుదరలేక సింగిల్‌తో సరిపెట్టుకున్నాడు. దీంతో చివరికి ఐదు పరుగుల తేడాతో శతకం మిస్సయ్యాడు. ఛేదనలో బెంగళూరు 193/9 స్కోర్‌కే పరిమితమై ఓటమిపాలైంది.


(Photo: David Miller Instagram)

గుజరాత్‌ మిల్లర్‌: దశాబ్ద కాలంగా ఈ టీ20 లీగ్‌లో ఆడుతున్నా సరైన గుర్తింపు దక్కని ఆటగాడు డేవిడ్ మిల్లర్‌. ఈసారి గుజరాత్ టీమ్‌లో అదరగొడుతూ ప్రత్యర్థులను బెదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆడిన 6 మ్యాచ్‌ల్లో 96.50 అద్భుత సగటుతో 193 పరుగులు చేశాడు. ఇక చెన్నైతో ఆడిన ఓ మ్యాచ్‌లో అతడు విశ్వరూపం చూపించాడు. ఆ జట్టు నిర్దేశించిన 170 పరుగుల ఛేదనలో గుజరాత్‌ 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమివైపు పయనించేలా కనిపించింది. కానీ, మిల్లర్‌ (94 నాటౌట్‌; 51 బంతుల్లో 8x4, 6x6), రషీద్‌ ఖాన్‌ (40; 21 బంతుల్లో 2x4, 3x6)తో కలిసి అనూహ్య విజయం అందించాడు. చివరి ఓవర్‌లో గుజరాత్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా, మిల్లర్‌ 82 పరుగులతో నిలిచాడు. ఇక జోర్డాన్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి రెండు బంతులను వదిలేసిన అతడు మూడో బంతిని సిక్సర్‌గా, నాలుగో బంతి (నోబాల్‌)ని బౌండరీగా మలిచాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీయడంతో గుజరాత్‌ గెలిచింది. ఒకవేళ లక్ష్యం ఇంకాస్త పెద్దదే అయ్యుంటే మిల్లర్‌ కచ్చితంగా శతకం బాదేవాడిలా కనిపించాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని