Cricket News: సిక్సర్‌ కొడితే వచ్చిన ఇబ్బందేమిటో తెలుసా?

స్టేడియం బయటకు బంతులు వెళ్లేలా కొట్టాలని ప్రతి బ్యాట్స్‌మన్‌ కలలు కంటాడు. సరైన బంతి దొరికితే భారీ సిక్సర్లు దంచికొట్టేందుకే ప్రయత్నిస్తాడు.

Published : 23 Jun 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టేడియం బయటకు బంతులు వెళ్లేలా కొట్టాలని ప్రతి బ్యాట్స్‌మన్‌ కలలు కంటాడు. సరైన బంతి దొరికితే భారీ సిక్సర్లు దంచికొట్టేందుకే ప్రయత్నిస్తాడు. నిజానికి ఆ సిక్సర్లు ఆనందాన్ని ఇచ్చినా కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తుంటాయి! ఇంగ్లాండ్‌లోని ఓ క్లబ్‌ క్రికెటర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

అసిఫ్ అలీ అనే యువ క్రికెటర్‌ ఇల్లింగ్‌వర్త్‌ సెయింట్‌ మేరీస్‌ క్రికెట్‌ క్లబ్‌కు ఆడుతుంటాడు. ఆదివారం వెస్ట్‌ యార్క్‌షైర్‌తో జరిగిన లీగ్‌ మ్యాచులో అలీ భారీ షాట్‌ ఆడాడు. బౌలర్‌ కాళ్ల వద్ద వేసిన బంతిని లెగ్‌సైడ్‌ తరలించాడు. సిక్సర్‌ బాదానని ఆనందించే లోపే అతడికి షాక్‌ తగిలింది. ఆ బంతి అతడి కారు ముందు అద్దాన్ని తాకింది. దాంతో ఒక్కసారిగా దిమ్మెరపోయాడు. రెండు చేతులతో తల పట్టుకున్నాడు.

‘ఆ బంతి నా కారువైపు వెళ్తుంటే.. ఓహ్‌.. నో.. నో.. నో.. ఏం జరుగుతోంది? అనుకున్నాను. అంతలోనే ఆ బంతి నా కారు ముందు అద్దంపై పడింది. నేను షాక్‌ అయ్యాను. చాలాకాలంగా నేనీ క్లబ్‌కు ఆడుతున్నాను. ప్రతిసారీ మైదానం బయటే కారు పార్క్‌ చేసేవాడిని. లోపలికి తీసుకురావడం ఇదే తొలిసారి’ అని అలీ ఐటీవీ న్యూస్‌తో చెప్పాడు.

అలీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని అతడి క్లబ్‌ ఛైర్మన్‌ జెరెమీ రోడ్స్‌ తెలిపాడు. కారు మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చాడు. తమ క్లబ్‌ కోసం అతడెన్నోసార్లు పరుగులు చేశాడని వెల్లడించారు. కాగా అలీ టాక్సీ డ్రైవర్‌ కావడం గమనార్హం. అదే అతడి జీవనాధారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని