INDvsENG: బ్యాటర్లకు విహారి సూచనలివే..!

ఇంగ్లాండ్‌లో విజయవంతం అవ్వాలంటే బంతిని ఆలస్యంగా ఆడాలని టీమ్‌ఇండియా ఆటగాడు హనుమ విహారి సూచించాడు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం పడుతుందని పేర్కొన్నాడు.

Published : 05 Jun 2021 01:23 IST

ముంబయి: ఇంగ్లాండ్‌లో విజయవంతం అవ్వాలంటే బంతిని ఆలస్యంగా ఆడాలని టీమ్‌ఇండియా ఆటగాడు హనుమ విహారి సూచించాడు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు సమయం పడుతుందని పేర్కొన్నాడు. మబ్బులు ఉంటే డ్యూక్‌ బంతులు ఎక్కువ స్వింగ్‌ అవుతాయని వెల్లడించాడు.

ఏప్రిల్‌లో హనుమ విహారి వార్విక్‌షైర్‌ తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడాడు. నాటింగ్‌హామ్‌ షైర్‌పై అరంగేట్రం మ్యాచులో 23 బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. మూడు మ్యాచుల్లో ఒక్క అర్ధశతకమే చేసినప్పటికీ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నాడు.

‘ఇంగ్లాండ్‌లో వాతావరణమూ ఆటలో కీలకం అవుతుంది. ఎండ కాస్తున్నప్పుడు బ్యాటింగ్‌ సులభం. అదే మబ్బులు వచ్చాయంటే రోజంతా బంతి స్వింగ్‌ అవుతూనే ఉంటుంది’ అని విహారి అన్నాడు. బ్రాడ్‌ బౌలింగ్‌లో ఔటైన తీరును బట్టి చూస్తే టీమ్‌ఇండియా బ్యాటర్లు కొన్ని మార్పులు చేసుకోవాలని అతడు సూచించాడు.

‘బ్రాడ్‌ వేసిన బంతి డ్రైవ్‌ చేసేందుకు అనువుగా ఉందనే అనుకున్నాను. కానీ ఇంగ్లాండ్‌లో ఏ షాట్‌ ఎంచుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. భారత్‌లో అయితే అలాంటి బంతిని సులభంగా పుష్‌ చేయొచ్చు. కుదరకపోతే పైనుంచి ఎలాగోలా డ్రైవ్‌ ఆడొచ్చు. అదే బంతిని నేను రెండోసారి ఆడాల్సి వస్తే మాత్రం సాధ్యమైనంత ఆలస్యంగా ఆడతాను’ అని విహారి అన్నాడు.

లైన్‌కు సమీపంగా ఆడేందుకు విహారి మిడిల్‌స్టంప్‌ గార్డ్‌ తీసుకోవడం గమనార్హం. ‘సాధారణంగా ఆస్ట్రేలియాలో లేటరల్‌ మూమెంట్‌ ఉండదు. లెగ్‌ గార్డ్‌ తీసుకోవచ్చు. అదే ఇంగ్లాండ్‌లో అయితే లైన్‌కు సమీపంగా ఆడాలి. ఆఫ్‌స్టంప్‌ను జాగ్రత్తగా చూసుకొని  ఆలస్యంగా ఆడాలి. ఎందుకంటే ఇక్కడ బంతి స్వింగ్‌ ఎక్కువగా ఉంటుంది’ అని విహారి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని