IND vs SA: రోహిత్‌కు ప్రమోషన్‌.. దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు ప్రకటన

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో...

Updated : 08 Dec 2021 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా డిసెంబర్‌ 26 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులను ఆడనుంది. అలానే మూడు వన్డేలను కూడా టీమ్‌ఇండియా ఆడుతుంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీని నియమించిన బీసీసీఐ.. రోహిత్‌ శర్మకు ప్రమోషన్‌ కల్పించి వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అలానే వన్డేలకు కూడా రోహిత్‌ శర్మను సారథిగా నియమించింది. ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా రోహిత్ ఎంపికైన సంగతి తెలిసిందే. అలానే టెస్టుల్లో ఉప సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన అజింక్య రహానెతోపాటు సీనియర్‌ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారాకు మరోసారి అవకాశం కల్పించింది. దక్షిణాఫ్రికాలో భారత్‌ -ఏ జట్టుతో పర్యటిస్తున్న హనుమ విహారికి జట్టులో స్థానం లభించింది. 

కివీస్‌తో సత్తా చాటిన మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులో స్థానం దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, షమీ, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌ తిరిగి జట్టులో స్థానం పొందారు. శుభ్‌మన్‌ గిల్ గాయపడటంతో స్థానం దక్కలేదు. బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహమ్మద్‌ సిరాజ్‌, స్పిన్నర్లు అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌లకు చోటు కల్పించింది. లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజాకు విశ్రాంతినివ్వడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే దక్షిణాఫ్రికా 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 

భారత్‌ జట్టు:  

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మయాంక్‌ అగర్వాల్, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్, హనుమ విహారి, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్ శర్మ, మహమ్మద్‌ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్, షమీ

స్టాండ్‌బై ఆటగాళ్లు: నవ్‌దీప్‌ సైని, సౌరభ్ కుమార్, దీపక్‌ చాహర్, అర్జాన్‌ నాగ్వాస్వాల్లా

దక్షిణాఫ్రికా జట్టు

ఎల్గర్‌ (కెప్టెన్‌), బవుమా (వైస్‌ కెప్టెన్‌) డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రబాడ, ఎర్వీ, హెండ్రిక్స్‌, జార్జ్‌ లిండె, కేశవ్‌ మహరాజ్‌, ఎంగిడి, మార్‌క్రమ్‌, వియాన్‌ ముల్డర్‌, నార్జ్‌, కీగన్‌ పీటర్సన్‌, డుసెన్‌, కైల్‌ వెరీని, మార్కో జాన్సెన్‌, గ్లెంటన్‌ స్టుర్‌మన్‌, ప్రెనెలన్‌, సిసాంద మెగాల, రికెల్టన్‌, ఒలివర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని