WPL: షెడ్యూల్‌ వచ్చేసింది.. ముంబయి-గుజరాత్ మధ్య తొలి సమరం

డబ్ల్యూపీఎల్‌ (WPL) తొలి సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మార్చి 4 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. 23 రోజుల పాటు మొత్తంగా 20 లీగ్ మ్యాచ్‌లు.. 2 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Updated : 14 Feb 2023 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల క్రికెట్‌ లీగ్‌ (WPL) తొలి సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. మార్చి 4 నుంచి మార్చి 25 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌ మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌- గుజరాత్ జెయింట్స్‌ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటల నుంచి డీవై పాటిల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. రెండో మ్యాచ్‌ మార్చి 5న బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌-దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. ఇదే రోజున డీవై పాటిల్‌ స్టేడియంలో మూడో మ్యాచ్‌లో యూపీ వారియర్స్-గుజరాత్ జెయింట్స్‌ తలపడనున్నాయి. 

డబ్ల్యూపీఎల్‌లో మొత్తం ఐదు జట్లు తలపడనున్నాయి. మొత్తం 23 రోజుల పాటు 22 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో 20 లీగ్‌ మ్యాచ్‌లు కాగా, మిగిలిన రెండు ఎలిమినేషన్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు. ఎలిమినేషన్‌ మ్యాచ్‌ మార్చి 24న డీవై పాటిల్‌ స్టేడియంలో, ఫైనల్‌ మార్చి 26న బ్రబౌర్న్‌ స్టేడియంలో జరగనుంది. లీగ్‌లో అన్ని మ్యాచ్‌లు ముంబయిలోనే జరుగుతుండటం గమనార్హం. బీసీసీఐ సోమవారం నిర్వహించిన డబ్ల్యూపీఎల్‌ వేలం అంచనాలు మించిపోయింది. పురుషుల క్రికెట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా మహిళా క్రికెటర్ల కోసం ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. భారత మహిళా క్రికెటర్లతోపాటు, విదేశీ ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని