Asia Cup 2022: ఆసియా కప్‌ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్‌ పోటీలకు ముందే జరగనున్న ఆసియా కప్‌ టోర్నీకి టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి దుబాయి వేదికగా జరగనున్న క్రికెట్‌ ఆసియా కప్‌ టోర్నీకి...

Updated : 08 Aug 2022 22:35 IST

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ పోటీలకు ముందే జరగనున్న ఆసియా కప్‌ టోర్నీకి టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా జరగనున్న క్రికెట్‌ ఆసియా కప్‌ టోర్నీకి జట్టును బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. గాయం కారణంగా కీలక బౌలర్లు బుమ్రా, హర్షల్‌ పటేల్‌ దూరం కానున్నారు. వాళ్లిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకొంటున్నట్టు బీసీసీఐ తెలిపింది.

టీమ్‌ఇండియా జట్టు ఇదే..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌, దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, అశ్విన్‌, వై.చాహల్‌, భువనేశ్వర్‌, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌, అవేశ్‌ఖాన్‌. శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌ను స్టాండ్‌బై ఆటగాళ్లుగా సెలక్ట్‌ చేశారు.

ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు యూఏఈలో ఆసియా కప్‌ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, రెండో రోజే గ్రూప్‌ ఏ విభాగంలో భారత్‌, పాక్‌ జట్లు ఆగస్టు 28న తలపడనున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో ఓటమిపాలైన టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది.

ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత శ్రీలంక వేదికగా నిర్వహించాలని నిర్ణయించినా.. అక్కడ రాజకీయ అనిశ్చితి కారణంగా వేదికను యూఏఈకి మార్చారు. దుబాయి, షార్జా మైదానాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సారి మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు ఆసియా ఖండానికి చెందిన మరొక జట్టు తలపడనుంది. ఆరో జట్టును క్వాలిఫయర్‌ ద్వారా డిసైడ్‌ చేస్తారు. ఆగస్టు 20 నుంచి యూఏఈ, కువైట్, సింగపూర్‌, హాంకాంగ్‌ జట్లతో క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయిర్స్‌ మ్యాచుల్లో తలపడి.. అందులోని ఒక జట్టు ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది.

మొత్తం ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు ఉన్నాయి. తొలుత భారత్‌.. గ్రూప్‌ ఏలోని పాక్‌, క్వాలిఫయర్‌ జట్టుతో లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. గత ఆసియా కప్‌(2018)లో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని